YS Jagan: తిరుపతి లడ్డుకు ఉన్న ప్రత్యేకత గురించి ప్రపంచవ్యాప్తంగా తెలుసు. ఆ లడ్డుకు ఉన్న రుచి, వాసన మరెక్కడా ఉండదంటే అతిశయోక్తి కాదు. అయితే ఇప్పుడు ఆ లడ్డు కల్తీ అయింది. తిరుపతి లడ్డు తయారీలో ఉపయోగించే నెయ్యి విషయంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఆ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. లడ్డు విషయంలో రాష్ట్రంలో అధికార కూటమి ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీ వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది.
మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) తిరుమల పర్యటనపై హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జగన్ పర్యటన నేపథ్యంలో తిరుమలలో ఆంక్షలు పెట్టారు పోలీసులు. జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల పర్యటన నేపథ్యంలో స్థానిక పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఆంక్షలు విధించారు. తిరుపతి వ్యాప్తంగా ర్యాలీలు, పెద్దఎత్తున గుమిగూడడం నిషేధిస్తూ పోలీసు చట్టంలోని సెక్షన్ 30 అమల్లో ఉందని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సుబ్బరాయుడు (SP Subbarayudu) తెలిపారు.
తిరుమల లడ్డూ వివాదానికి సంబంధించి కొనసాగుతున్న నిరసనల దృష్ట్యా వైఎస్‌ఆర్‌సిపికి చెందిన పలువురు నాయకులు మరియు కార్యకర్తలకు అనధికారిక సమావేశాలు లేదా ఊరేగింపులను నిర్వహించవద్దని సలహా ఇస్తూ అధికారులు ముందస్తుగా నోటీసులు ఇచ్చారు. ర్యాలీలు, బహిరంగ సభలు సహా ఎలాంటి సభలకైనా ముందస్తు అనుమతి తప్పనిసరి అని పోలీసులు ఉద్ఘాటించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఒక నెల పాటు, ప్రత్యేకంగా అక్టోబర్ 24 వరకు ఆంక్షలను అమలు చేశారు.
మాజీ సీఎం జగన్ తన పర్యటనకు సిద్ధమవుతున్న తరుణంలో పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించేందుకు, ఎలాంటి అశాంతి తలెత్తకుండా ఉండేందుకు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.