Tadipatri : అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో బుధవారం ఉదయం కూడా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసాల వద్ద ఉన్న కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేసి, అదుపులోకి తీసుకున్నారు. ఈ లాఠీఛార్జిలో జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు కిరణ్‌కుమార్ సహా మొత్తం ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని తొలుత స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఏపీలో పోలింగ్ సమయంలో తాడిపత్రిలో ఏర్పడిన ఉద్రిక్త వాతావరణం ఇంకా కొనసాగుతోంది. తాడేపల్లి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో తాడిపత్రి పట్టణంలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పోలీసు బలగాల పహారాతో పట్టణంలోని వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. తాడిపత్రి పట్టణంలో గుంపులు గుంపులుగా ఉండొద్దంటూ ప్రజలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
We’re now on WhatsApp. Click to Join
మంగళవారం అర్ధరాత్రి టైంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఆయన కుమారుడిని, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడిని పోలీసులు ఇతర ప్రాంతాలకు తరలించారు. రాళ్లు రువ్వడానికి సిద్ధంగా ఏర్పాటు చేసుకున్న రాళ్లను అనంతపురం ఆర్డీవో వెంకటేశులు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు తొలగించారు. ఈనేపథ్యంలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తాడిపత్రి పోలీసు స్టేషనుకు వెళ్లి తన ఇంటి పని మనుషులను అదుపులోకి తీసుకున్నారని.. వాళ్లను వదిలేయాలని కోరారు. ఇంట్లో ఉన్నవాళ్లం ఇద్దరం కూడా రోగులమేనని, సమయానికి ఆహారం, మందులిచ్చే వారు లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పారు.ఈవిషయాన్ని పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని డీఎస్పీ రంగయ్య చెప్పడంతో స్టేషన్ నుంచి జేసీ దివాకర్ రెడ్డి వెళ్లిపోయారు.