Mission South : జనసేన పార్టీ కేవలం జనసేనాని, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కే కాదు.. బీజేపీకి కూడా చాలా ముఖ్యమైంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తమతో ఉండే నమ్మకమైన భాగస్వామిగా జనసేన పార్టీని బీజేపీ పరిగణిస్తోంది. అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలు పవన్ కల్యాణ్‌కు అంతగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు యావత్ దక్షిణాది రాష్ట్రాల్లో కమల వికాసం కోసం పవన్ చరిష్మా తమకు ఉపయోగపడుతుందనే విశ్వాసంతో వారు ఉన్నారు. ప్రధాని మోడీ ‘సౌత్ మిషన్’లో జనసేనాని కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈక్రమంలోనే ఈనెల 12 నుంచి పవన్ కల్యాన్ దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను సందర్శిస్తారు. నాలుగు రోజుల ఈ పర్యటనలో భాగంగా అనంతపద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరుస రామ స్వామి, అగస్త్య జీవసమాధి కుంభేశ్వర దేవాలయం, స్వామిమలై, తిరుత్తై సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయాలను పవన్(Mission South) దర్శించుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని ఇటీవలే పవన్ చేసిన వ్యాఖ్యలకు పలువురు ప్రముఖులు మద్దతు ప్రకటించారు.
Also Read :Ranveer Allahbadia: ‘‘తల్లిదండ్రులు అది చేస్తుంటే చూస్తావా ?’’.. యూట్యూబర్ నీచ వ్యాఖ్యలపై దుమారం
ఏమిటీ ‘మిషన్ సౌత్’ ?
- దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయడమే ప్రధాని మోడీ ‘సౌత్ మిషన్’ లక్ష్యం.
- దక్షిణాది రాష్ట్రాల్లో హిందుత్వ భావజాలాన్ని సాధ్యమైనంత ఎక్కువగా ప్రచారం చేయడం అనేది ముఖ్యమైన ఎజెండా.
- ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ పర్యటనల ద్వారా.. ఏపీలోనూ ఆయన రాజకీయ చరిష్మాను మరింత పెంచాలనేది బీజేపీ వ్యూహం. పవన్ చరిష్మా పెరిగితే రానున్న కాలంలో ఏపీలో రాజకీయ ప్రయోజనం పొందొచ్చని కమలదళం భావిస్తోంది.
- దక్షిణాది రాష్ట్రాల్లో మరింత మంది సినీ స్టార్లను బీజేపీ వైపు ఆకర్షించాలని ప్రధాని మోడీ భావిస్తున్నారు. ఆ ఆసక్తి ఉన్నవారికి స్ఫూర్తి కలిగించేలా పవన్‌ను ప్రయోగిస్తున్నారు.
- దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో 40 నుంచి 50 లోక్‌సభ స్థానాలను గెలవాలనే బీజేపీ కల నేటికీ నెరవేరలేదు. అది నెరవేరాలంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీకి పవన్ కల్యాణ్ లాంటి జనాకర్షక నాయకులు కావాలి.
- ఏపీ తరహాలో ఇతరత్రా దక్షిణాది రాష్ట్రాల్లోనూ భావసారూప్య పార్టీలతో కూటమి కట్టాలనే ప్రణాళికలు బీజేపీకి ఉన్నాయి. ఆ సందేశాన్ని పరోక్షంగా ఇతర దక్షిణాది రాష్ట్రాలకు చేరవేసేందుకు పవన్ కల్యాణ్‌ను బీజేపీ వినియోగించుకుంటోంది.