Jagan Agenda Before Modi: మోడీ ఎదుటే `జ‌గ‌న్ ఎజెండా` కుండ‌బ‌ద్ద‌లు

వైసీపీ ఎజెండా ఏమిటో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఎదుట సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే మా ఎజెండా అంటూ ప‌రోక్షంగా బీజేపీకి జ‌ల‌క్ ఇచ్చారు. రాజ‌కీయాలకు అతీతంగా మోడీతో అనుబంధం ఉంద‌ని చెబుతూనే ఏపీ ప్ర‌యోజ‌నాల‌ను కాపాడే ఏ ఇత‌ర పార్టీల‌తోనైన జ‌త క‌ట్ట‌డానికి వెనుకాడ‌బోన‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సున్నితంగా పరోక్ష సంకేతాలు ఇవ్వ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపుతోంది.

  • Written By:
  • Updated On - November 12, 2022 / 12:53 PM IST

వైసీపీ ఎజెండా ఏమిటో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఎదుట సీఎం జగన్ మోహన్ రెడ్డి కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే మా ఎజెండా అంటూ ప‌రోక్షంగా బీజేపీకి జ‌ల‌క్ ఇచ్చారు. రాజ‌కీయాలకు అతీతంగా మోడీతో అనుబంధం ఉంద‌ని చెబుతూనే ఏపీ ప్ర‌యోజ‌నాల‌ను కాపాడే ఏ ఇత‌ర పార్టీల‌తోనైన జ‌త క‌ట్ట‌డానికి వెనుకాడ‌బోన‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సున్నితంగా పరోక్ష సంకేతాలు ఇవ్వ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపుతోంది.

దేశ ప్రగతి రథసారథి, గౌరవనీయులు, పెద్దలు, ప్రధాని నరేంద్ర మోదీ గారికి విశాఖకు రావ‌డాన్ని హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నానని ముఖ్యమంత్రి జగన్ ఆత్మీయ‌త‌ను ప్ర‌ద‌ర్శించారు. చారిత్రక ఆంధ్ర యూనివర్శిటీలో ఈరోజు ఒకవైపు సముద్రం, మరోవైపు జన సముద్రం కనిపిస్తున్నాయని ఉత్తేజ‌ప‌రిచారు. ఈ సభకు ఉత్తరాంధ్ర జనం ప్రభంజనంలా తరలివచ్చారని అన్నారు. రాష్ట్రంలో ₹. 10,742 కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తున్నందుకు రాష్ట్ర ప్రజలందరి తరపున, ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. విశాఖలోని ఏయూ గ్రౌండ్ లో ప్రధాని మోదీ సభలో జగన్ ప్రసంగం క్లుప్తంగా ముగిసింది.

Also Read:  Lokesh Yatra: పాద‌యాత్ర‌కు యువ‌కెర‌టం రెడీ

మూడేళ్ల‌లో రాష్ట్రంలో జ‌రిగిన అభివృద్ధి గురించి ప్ర‌స్తావించారు. ‘సార్, ఈ మూడేళ్లలో ప్రజలకు అనుకూలంగా ఎన్నో చేశాం. మహిళలకు సాధికారత, విద్య, వైద్యం, గ్రామ సచివాలయాలు వంటి కార్యక్రమాల్లో ఎంతో అభివృద్ధిని సాధించాం. గడప వద్దకే పాలన ప్రాధాన్యతగా అడుగులు ముందుకు వేస్తున్నాం. ఏపీకి మీరు పెద్ద మనసుతో ఎంతో చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో, ముఖ్యంగా మీతో మాకు ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. కేంద్రంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతమైనది. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా రైల్వే జన్ వంటి వాటిపై మేము పలుమార్లు చేసిన విన్నపాల పట్ల సానుకూలంగా స్పందించాలని కోరుకుంటున్నా. రాష్ట్రానికి మీరు చేసే ప్రతి సాయం, ఇచ్చే ప్రతి సంస్థ, ప్రతి రూపాయి మా అభివృద్ధికి దోహదపడతాయి. పెద్దలైన మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి` అంటూ జ‌గ‌న్ ప్ర‌త్య‌క్షంగా న‌మో అంటూనే ప‌రోక్షంగా నిల‌దీయ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌త్యేక హెలికాప్ల‌ర్లో ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్ కు ప్రధాని మోదీ చేరుకున్నారు. ఐఎన్ఎస్ చోళ గెస్ట్ హౌస్ నుంచి హెలికాప్టర్ లో సభాస్థలికి వ‌చ్చారు. ఈ సందర్భంగా మోదీకి కీలక నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రధానికి జగన్ శాలువా కప్పి సత్కరించారు. శ్రీరాముడి విగ్రహాన్ని బహూకరించారు. అనంతరం సభాస్థలి వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రధాని వీక్షించారు.

Also Read:  Pawan Kalyan: ఏపీ ప్రజలకు మంచిరోజులు రాబోతున్నాయి… మోదీ తో భేటీ తర్వాత పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన.!!

అభివృద్ధి పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఇప్పటికే పూర్తయిన పనులను జాతికి అంకితం చేశారు. అనంతరం భారీ బహింరంగ సభలో మోడీ ప్ర‌సంగించారు. ఏపీలో రూ. 10,742 కోట్లతో చేపట్టనున్న పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు, ఇప్పటికే పూర్తయిన పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయ‌డం ఆనందంగా ఉంద‌ని మోడీ అన్నారు. మోదీ సభను వైసీపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జ‌నాన్ని త‌ర‌లించారు. వీరి తరలింపు కోసం 4 వేల బస్సులు, పెద్ద సంఖ్యలో వాహనాలను ఏర్పాటు చేశారు. 8,500 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భారీగా వ‌చ్చిన జనాలతో మద్దిలపాలెం జంక్షన్ జన సంద్రంగా మారింది.