Ration Rice Scam Case : రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని భార్య పేర్ని జయసుధ ఈరోజు మచిలీపట్నం తాలూకా పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధకు చెందిన గోడౌన్ లో పీడీఎస్ బియ్యం మాయమైనవి. అధికారుల విచారణలో 387 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్టు గుర్తించారు. తొలుత 187 మెట్రిక్ టన్నుల బియ్యానికిగాను 1.68 కోట్లు జరిమానా చెల్లించారు. మొత్తం 387 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైన విషయాన్ని అధికారులు గుర్తించారు. ఇందుకు గాను ఇంకా రూ. 1.67 కోట్లు చెల్లించాలని అధికారులు ఆదేశించారు.
తమ గోడౌన్ లో రేషన్ బియ్యం తక్కువగా ఉన్నాయని పేర్ని జయసుధ 2023, నవంబర్ 27న పౌరసరఫరాల శాఖ అధికారులకు లేఖ రాశారు. ఈ లేఖ ఆధారంగా అధికారులు సోదాలు నిర్వహించారు. బియ్యం తక్కువగా ఉన్న విషయమై సివిల్ సప్లయిస్ అధికారుల ఫిర్యాదు మేరకు మచిలీపట్టణం పోలీసులు జయసుధపై డిసెంబర్ 11న కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించారు. 2023, డిసెంబర్ ౩౦న కోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరైంది. అయితే ఈ కేసులో జయసుధ భర్త మాజీ మంత్రి పేర్నినానిని ఏ 6 గా చేర్చారు. దీనిపై ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఏపీ హైకోర్టు ఈ నెల 6 వరకు ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.
కాగా, రాజకీయ కక్షతోనే ఈ కేసును నమోదు చేశారని పేర్ని నాని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను అధికారపక్షం కొట్టిపారేసింది. రేషన్ బియ్యం తక్కువగా ఉందని లేఖలు రాసిందెవరు.. జరిమానా చెల్లించిదెవరని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ఇక..రేషన్ బియ్యం అక్రమాలకు చెక్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని గోడౌన్లను తనిఖీలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ విషయం వెలుగు చూసింది.
Read Also: New Pamban Bridge : పాంబన్ వంతెన రెడీ.. బోల్టు నుంచి లిఫ్ట్ దాకా అబ్బురపరిచే విశేషాలు