Pemmasani: మిర్చి రైతుల కల్లాలను చూసి చలించిన కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని (Pemmasani) అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచేందుకు నడుం బిగించారు. స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో మిర్చి విభాగం ఏర్పాటు చేయాలని, కనీస మద్దతు ధర కల్పించాలని సంబంధిత శాఖల కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, శివరాజ్ సింగ్ చౌహాన్ కు లేఖ రాశారు. గుంటూరు జిల్లాలోని మిర్చి రైతులు తీవ్ర సవాళ్ళు ఎదుర్కొంటున్నారని, అధిక భాగం దిగుబడి కోల్డ్ స్టోరేజీల్లో ఉండటంతో మార్కెట్ ధరలు గిట్టుబాటు కావడం లేదని వివరించారు. పెరుగుతున్న పెట్టుబడులు, చీడపీడల బెడద, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు లేకపోవడంతో మిర్చి రైతుల జీవనోపాధి అగమ్య గోచరంగా మారిందని పేర్కొన్నారు. మిర్చి డివిజన్ ఏర్పాటు చేయడం ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం చూపగలుగుతామని అభిప్రాయపడ్డారు.
గుంటూరులో ఆసియాలోని అతిపెద్ద మిర్చి మార్కెట్ ఉందని, ఇది పరిశోధనలు ప్రోత్సహించడానికి కేంద్రంగా మారుతుందని వివరించారు. మిర్చి బోర్డు ఏర్పాటు ద్వారా చీడపీడల నివారణ, ఎగుమతి సౌకర్యాలు, ఆధునిక ప్రాసెసింగ్ వంటి కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందన్నారు. గుంటూరు సన్నం, తేజ వంటి అధిక విలువ కలిగిన వంగడాలను ప్రోత్సహించడానికి అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలు కలిగిన దిగుబడులు సాధించేందుకు దోహదం చేస్తుందని వివరించారు. భారత దేశ మిర్చి రంగం ఆర్థిక వ్యవస్థకు కీలకమని, సుగంధ ద్రవ్యాల ఎగుమతుల్లో మిర్చి వాటా 34 శాతం, 2023 24 సంవత్సరంలో రికార్డు స్థాయిలో 1.5 బిలియన్ డాలర్లకు ఇది చేరుకుందని పేర్కొన్నారు.
Also Read: Manoj Sympathy: మంచు ఫ్యామిలీలో మంటలు.. మనోజ్‌కు పెరుగుతున్న సానుభూతి!
కనీస మద్దతు ధర కల్పించాలి
ప్రపంచ మిర్చి ఉత్పత్తిలో భారతదేశం 40 శాతం వాటా కలిగి ఉందని, పది లక్షల మంది రైతులు మిర్చి పంటల సాగు చేస్తున్నారని, 20 లక్షల మందికి వ్యవసాయ కార్మికులు జీవనోపాధి కలిగి ఉన్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. మిర్చి ఎకరా సాగు సగటు వ్యయం 2.50 లక్షలకు చేరిందని, 2022 23 ఆర్థిక సంవత్సరం నుంచి మిర్చి ధరలు 50 శాతం పడిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని, వెంటనే కనీస మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని విన్నవించారు. కౌలు రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధర కల్పించడం ద్వారా దళారుల దోపిడీ నుంచి రైతులను రక్షించవచ్చని, మిర్చి రైతులకు ఆర్థిక సుస్థిరత అందించవచ్చని అభిప్రాయపడ్డారు.