Peddireddy : మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఆక్రమించిందని వచ్చిన ఆరోపణలపై స్పందించారు. అవి అటవీ భూములు కాదన్నారు. తాము ఇరవై ఏళ్ల కిందటే వాటిని ఆ భూములు యజమానుల వద్ద 2001లో కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకున్నామన్నారు. అప్పట్లోనే అక్కడ పని చేసే వారి కోసం నిర్మాణాలు చేశామన్నారు. ఇప్పుడు కొత్తగా ఆ భూమిని అటవి భూమ అని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు ప్రజలకు తెలుసని విమర్శించారు. అలాగే, ఎంతమంది వైసీపీ నుంచి వెళ్లినా పార్టీకి ఏం కాదన్నారు. విజయసాయిరెడ్డి రాజీనామా ఆయన వ్యక్తిగతం అని చెప్పారు.
ఆ భూములు అడవి మద్యలో ఉన్నప్పటికీ.. ప్రైవేటు భూములేననడానికి అన్ని రికార్డులు ఉన్నాయని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. గతంలో పలుమార్లు ఈ భూములపై విచారణ జరిగిందన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు విచారణ కూడా చేశారని కానీ ఎలాంటి అవకతవకలు గుర్తించలేదన్నారు. ఈ భూములు అటవీ భూములు కాదని గతంలో అధికారులు కూడా నిర్ధారించారని కూడా తెలిపారు. రాజకీయాల్లో వ్యక్తిత్వ హననం చేసేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనపై ఇలాంటి కథనాలు రాసిన పత్రికపై తాను ఇప్పటికే యాభై కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశానన్నారు. నాపై ఎన్ని విచారణలు అయిన చంద్రబాబు వేసుకోవచ్చు. అధికారులే కాదు నేరుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వచ్చి విచారించకోవచ్చు అని అన్నారు.
కాగా, పెద్దిరెడ్డి కుటుంబం పలు చోట్ల ఈ తరహా భూకబ్జాలకు పాల్పడిందన్న ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి చేరినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అనంతపురం కన్జెర్వేటర్ ఆఫ్ ఫారెస్టు అధికారులతో జాయింట్ కమిటీ ఏర్పాటు అయింది. జాయింట్ కమిటీలో సభ్యులుగా చిత్తూరు కలెక్టర్ సుమిత్, జిల్లా ఎస్పీ మనికంఠ చందోలు, ఐఎఫ్ఎస్ అధికారి యశోద బాయ్ ఉన్నారు. దర్యాప్తు నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది.
Read Also: Congress guarantees : రేపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు..