రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు , నేరాల పట్ల హోం శాఖా (Home Department) కు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శాంతిభద్రతలు అదుపులో లేకుంటే, అవసరమైతే హోంమంత్రి పదవిని కూడా తాను తీసుకోవడానికి వెనుకాడనని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో ఉన్నట్టుగా ప్రస్తుతం అధికారులు ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించారు. అయితే, తాను హోంమంత్రి అయితే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుందని పవన్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు నిజాయతీగా ఉండాలన్న విషయాన్ని గట్టిగా చెప్పిన ఆయన, పోలీసు అధికారులు తమ తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ముఖ్యంగా, హోంమంత్రి అనిత శాంతిభద్రతల విషయంలో మరింత చురుగ్గా వ్యవహరించాలని సూచించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. వైసీపీ మహిళా నేతలు.. అనిత హోంమంత్రిగా విఫలమయ్యారని ఆరోపణలు చేస్తూ, ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మాజీ మంత్రి రోజా సెల్వమణి మాట్లాడుతూ.. పవన్ కల్యాణే స్వయంగా అనిత యొక్క పనితీరుపై నిందలు మోపారని, తాము మొదటి నుంచి ఆమె తీరు పట్ల విమర్శలు చేస్తూనే ఉన్నామని చెప్పుకొచ్చారు. అత్యాచార నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళల భద్రతను నిర్ధారించడంలో విఫలమైన అనిత తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
వైసీపీ మహిళా అధ్యక్షురాలు వరుదు కల్యాణి మాట్లాడుతూ.. చంద్రబాబు కేబినెట్ మొత్తం విఫలమైందని, మహిళల భద్రతకు హోం మంత్రి అనితే కారణమని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో మహిళల భద్రత మరింత దిగజారిందని, అనిత మాత్రం ప్రశాంతంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. మొత్తం మీద పవన్ చేసిన వ్యాఖ్యలు అనిత పోస్ట్ కే ఎసరు వచ్చేలా ఉన్నాయని కూటమి శ్రేణులు మాట్లాడుకుంటున్నారు.
Read Also : Pushpa 2 : పుష్ప 2 ప్రమోషన్స్ కోసం నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్..!