రాజకీయాల్లోనూ హీరోయిజం చూపాలన్నదే జనసైనికాధిపతి పవన్ కల్యాణ్ లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటమే తప్ప, వంగి వంగి సలాములు చేసేది లేదన్న జనసేనాని మాటలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తనదైన స్టైల్‌లో పంచ్ డైలాగ్‌లు విసురుతూ పవనిజం అంటే ఇదీ అని చెప్పదలచుకున్నారు. అధికారం ఇస్తే ఏమి చేస్తామో ఇప్పటి నుంచే చెప్పడం చూస్తుంటే.. పవన్ టార్గెట్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.
తొలుత మత్స్యకారులకు చెందిన సమస్యపై తన సొంత జిల్లా నరసాపురంలో ఆందోళన ప్రారంభించారు. చెరువులు, కుంటల్లో చేపలు పట్టాలంటే ముందుగా ఆన్‌లైన్‌లో వాటి వివరాలు నమోదు చేయాలని, మత్స్యకారులు అడ్వాన్సుగా 25 శాతం చెల్లించాలంటూ ఏపీ ప్రభుత్వం జీవో నెంబరు 217ను తీసుకొచ్చింది. ఎప్పుడూ, ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి జీవో లేదంటూ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
జనసేనకు కనీసం పది మంది ఎమ్మెల్యేలను ఇచ్చి ఉన్నా ఇలాంటి జీవో ఇచ్చే సాహసం ప్రభుత్వానికి ఉండేది కాదంటూ ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేశారు పవన్ కల్యాణ్. రాచరికం వైఖరితో వ్యవహరించే వైసీపీ వారికే ఇలాంటి జీవోలు ఇచ్చే తెగింపు ఉంటే, స్వాతంత్య్ర సమరయోధుల ఆదర్శాలతో పని చేస్తున్న తమకు పోరాడే శక్తి ఇంకా చాలా ఉందని స్పష్టం చేశారు. జైలుకైనా వెళ్తాను గానీ, తలవంచేదే లేదని చెప్పి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
ఆందోళనలో ముందు నడుస్తానని, తొలి దెబ్బను తానే తింటానని చెప్పడం ద్వారా తన హీరోయిజాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు. పది మందికి మేలు చేసే వారికి పాదాభివందనం చేస్తానని, అహంకారంతో వ్యవహరించే వారి విషయంలో తల తెగిపోయినా సరే వెనక్కి తగ్గబోనని పవర్‌ఫుల్‌గా చెప్పారు. మార్చి 14న జరగనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే విషయమై పవన్ కల్యాణ్ ప్రత్యేకమైన స్ట్రాటజీతో అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.