Pawan trip to Delhi: పవన్ ఢిల్లీ పర్యటన తుస్! అంతా సినిమాటిక్!!

జనసేనాని పవన్ ఢిల్లీ పర్యటన కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉంది. రెండు రోజులు బీజేపీ అగ్ర నేతలతో భేటీ అయిన ఆయన వైసీపీ ముక్త్ ఏపీ అనే డైలాగును బయటకు తీశారు.

  • Written By:
  • Updated On - April 5, 2023 / 05:22 PM IST

Pawan trip to Delhi : జనసేనాని పవన్ ఢిల్లీ పర్యటన కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉంది. రెండు రోజులు బీజేపీ అగ్ర నేతలతో భేటీ అయిన ఆయన వైసీపీ ముక్త్ ఏపీ అనే డైలాగును బయటకు తీశారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటూ మోడీ , షా వెళుతున్నారు. అదే ఫార్ములాను ఏపీకి పవన్ ఎంచుకున్నారు. కానీ దాన్ని చేరుకోవడం ఎలా? అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. ఢిల్లీ బీజేపీ తాను అనుకుంటున్నది ఒకటే అంటూ సరికొత్త లాజిక్ బయటకు తీశారు. వాస్తవంగా తెలంగాణలో అధికారం, ఏపీలో కింగ్ మేకర్ కావాలని బీజేపీ భావిస్తుంది. అదే పవన్ కూడా అనుకుంటున్నారా? లేదా ప్రభుత్వ ఓటు చీలకుండా టీడీపీ తో కలిసే ప్రయత్నం పవన్ (Pawan) చేస్తున్నట్టు బీజేపీ చేస్తుందా? అనేది సందిగ్ధం. పవన్ ఢిల్లీ వెళ్ళక ముందు పొత్తులపై ఏ సందేహాలు ఉన్నాయో అవే ఇప్పుడు కూడా ఉన్నాయి. కొత్తగా రెండు రోజులు ఢిల్లీకి వెళ్లొచ్చిన పవన్ ఏమి సాధించారు అనేది ఏపీ పొలిటీకల్ సర్కిల్స్ లో నడుస్తున్న చర్చ. ఏపీని ఎలా విముక్తి చేయాలో బీజేపీ నేతలతో చర్చించానని పవన్ తెలిపారు. ఏపీకి సంబంధించి స్థిరత్వం ఉండాలని రెండు పార్టీలు కోరుకుంటున్నాయన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ జనసేన లక్ష్యమని పవన్ స్పష్టం చేశారు.

రాష్ట్రంలో అధికారం సాధించే దిశగా జనసేన బీజేపీ ముందుకు వెళ్తాయన్నారు. భవిష్యత్ లో ఏపీకి మంచి రోజులు ఉంటాయని పవన్ తెలిపారు. మంచి ప్రణాళికతో బీజేపీ జనసేన ముందుకెళ్లబోతున్నాయన్నారు. అంటే టీడీపీ ని కాదని ఆ రెండు పార్టీలు వెళ్తాయని ఒక వాదంగా ఉంది.జేపీ నడ్డాతో రాష్ట్ర రాజకీయ పరిస్థితుల పై చర్చించానని పవన్ (Pawan) వెల్లడించారు. ప్రధానంగా వైసీపీ పాలన నుంచి ఏపీని ఎలా విముక్తి చేయాలనే దానిపైనే ఇరు పార్టీలు చర్చలు జరిపామన్నారు. రాష్ట్ర భవిష్యత్ రాజకీయ ప్రణాళిక గురించి బీజేపీ నేతలతో చర్చించామని వివరించారు. అయితే పొత్తుల పై చర్చించలేదని, సరైన సమయానికి పొత్తుల పై స్పష్టత ఇస్తామని పవన్ వెల్లడించారు. అంటే పొత్తు ఉంటుందని సంకేతాలు ఇచ్చారు.

జేపీ నడ్డాతో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న వర్తమాన రాజకీయ పరిణామాలపై పవన్ చర్చించారు. పాలన సంబంధిత అంశాలు కూడా ఇరువురు నేతల మధ్య ప్రస్తావనకు వచ్చాయని తెలుస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరవైన పరిస్థితిని అవినీతి తదితర విషయాలను ప్రస్తావించినట్టు సమాచారం. మూడేళ్ళల్లో పవన్ (Pawan) ఎంత ప్రయత్నించినా వాళ్ళు అపాయిట్మెంట్ ఇవ్వటం లేదు. మోడీ వైజాగ్ పర్యటనకు వచ్చారు కాబట్టే పవన్ కలిశారు. అదే ఢిల్లీకి వస్తాను అపాయిట్మెంట్ కావాలని అడిగితే మాత్రం మోడీ ఇవ్వటంలేదు. పోనీ నడ్డాను కలిసిన తర్వాతయినా బీజేపీతో కంటిన్యు అయ్యే విషయం పై క్లారిటి ఇచ్చారా అంటే అదీలేదు.

తాను టీడీపీతో పొత్తు పెట్టుకోబోతున్నాను బీజేపీతో కటీఫ్ చేసుకుంటున్నట్లు చెప్పారా అంటే అదీ చెప్పలేదు.పొత్తుల పైన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేని పవన్ మరి రెండురోజులు ఢిల్లీలో ఎందుకు వెయిట్ చేసినట్లు. టీడీపీతో కూడా పొత్తు పెట్టుకోవాలని పవన్ చేసిన సూచన పై నడ్డా సానుకూలంగా స్పందించినట్లు లేదు. అందుకనే ఏమిమాట్లాడాలో తెలీక ఏదో నోటికొచ్చినట్లు మాట్లాడేసి మీడియా ముందు పిచ్చినవ్వులు నవ్వేసి వెళ్ళిపోయారు. దీంతోనే పవన్ ఢిల్లీ టూర్ సక్సెస్ కాలేదని అందరికీ అర్ధమైపోయింది. ఒకవేళ తాను అడిగినట్లు లేదా అనుకుంటున్నట్లు నడ్డా గనుక స్పందించుంటే పవన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయుండేవారే అనటంలో సందేహంలేదు అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుని.. ముందుకు సాగాలనే లక్ష్యంతో బీజేపీ పెద్దలు ఉన్నారు.

అంటే.. ఏపీలో ఉన్న అధికార పార్టీ వైసీపీ అధినేత సహకారం ఇప్పుడు బీజేపీకి అత్యవసరంగా మారింది. ఇలాంటి సమయంలో అనూహ్యంగా వైసీపీకి చెక్ పెడుతూ పొత్తులకు చేతులు కలపడం అనేది ఏ రకంగానూ రాజకీయ వ్యూహం కానేరదు. ఈ విషయం గ్రహించకుండానే పవన్ ఢిల్లీ బాట పట్టడం గమనార్హం.

టీడీపీని చేరదీయడం వల్ల ఇప్పటికిప్పుడు బీజేపీకి వచ్చే ప్రయోజనం ఎంత? అనే అంచనాలు కూడా బీజేపీ పెద్దల దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం వైసీపీలో ఉన్న నాయకులు అధికారంలో ఉన్నారు కనుక.. తమకు అన్ని విధాలా సాయం చేసే అవకాశం ఉంది. అటు నుంచి సహకారం కూడా ఉంది.ఇలాంటి తరుణంలో వైసీపీ వంటిబలమైన అధికార పార్టీని పక్కన పెట్టి బీజేపీ నేతలు ఇప్పటికిప్పుడు పొత్తుల కోసం వెంపర్లాడతారనేది అసాధ్యం. మొత్తంగా రెండు రోజుల పవన్ ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పడం కాదు నేరుగా కూడా తిప్పలేదని అర్థం అవుతోంది.

Also Read:  Telangana Elections: పార్లమెంట్ తో తెలంగాణ ఎన్నికలు?