Ap Assembly : ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటి అయ్యారు. ఈరోజు అసెంబ్లీలో చంద్రబాబు ఛాంబర్‌కు పవన్ కల్యాణ్ వెళ్లారు. ఆయన ఛాంబర్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్ర బడ్జెట్, వివిధ శాఖలకు కేటాయింపులపై చర్చించారు. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక అంశంపైనా ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. దాదాపు గంటపాటు వీరి భేటీ కొనసాగింది. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను బ్యాలెన్స్ చేస్తూ కేటాయింపులు ఉన్నట్లు పవన్ అభిప్రాయపడ్డారు. మే నెల నుంచి ప్రారంభించే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించిన అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చాయి.
Read Also: Ayodhya’s Ram Mandir : అయోధ్య ఆలయంపై దాడికి పాకిస్థాన్ కుట్ర
ఇక, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో కూటమి అభ్యర్థి వెనుకంజలో ఉండటం, పీడీఎఫ్ అభ్యర్థి ముందంజలో ఉండటంపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం చంద్రబాబు, పవన్ భేటీ కొనసాగుతోంది. ముగిసిన తర్వాత ఈ భేటీ ఎందుకనే విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ఇద్దరి భేటీకి ప్రాధాన్యత చోటు చేసుకుంది ఐదు ఎమ్మెల్సీ స్థానాలల్లో జనసేన రెండు, బీజేపీ ఒక ఎమ్మెల్సీని కోరుతున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు ఇప్పటికే ఎమ్మెల్సీ ఖరారు అయింది. ఇంకో ఎమ్మెల్సీకి అవకాశం ఇవ్వాలని పవన్ కల్యాణ్ కోరుతున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్న విషయం తెలిసిందే. మార్చి 29తో ఐదుగురు సభ్యుల పదవీ కాలం ముగియనుంది. ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, అశోక్‍బాబు, బీటీ నాయుడు, యనమల రామకృష్ణుడు పదవీ కాలం ముగియనుంది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా సోమవారం విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తోంది.