పట్టణాలకు దూరంగా ఉండే గిరిపుత్రులు నిత్యం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. నేటికీ విద్య, వైదం అందక ఎంతోమంది అవస్తలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గిరిపుత్రుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ‘‘అడవి తల్లిని నమ్ముకున్న బిడ్డలు.. కల్లాకపటం ఎరుగని మనుషులు.. మన గిరిజనులు. కొండకోనల్లో నివసిస్తూ సంప్రదాయాలను బతికించుకొంటున్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిపుత్రులకు ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అటవీ ప్రాంతంలో అనువైన పంటలు పండించుకుంటూ… చెట్టుచేమలు, సకల జీవాలను దైవసమానంగా చూసుకొనే జీవ వైవిధ్య పరిరక్షకులు వారు. గిరిజనుల జీవితాలు నిత్యం సవాళ్లతో కూడుకున్నవే’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘విద్య, వైద్యం, శుభ్రమైన తాగు నీరు వీరికి ఇప్పటికీ గగనకుసుమాలే. కొండకోనలు దాటి రావడానికి ఇష్టపడని ఈ అడవి బిడ్డలకు అనారోగ్యం చేసినా, ప్రసవానికి ఆస్పత్రికి వెళ్ళాలన్నా ఆ బాధలు వర్ణనాతీతం.. మంచానికి కర్రలుకట్టి వాగులు వంకలు దాటుకుంటూ ప్రయాసతో వారు ఆస్పత్రులకు వెళ్ళడం మనం ప్రసార మాధ్యమాలలో చూస్తూనే ఉన్నాము. ఆ దృశ్యాలు చూస్తే గుండె బరువైపోతుంటుంది. ఈ పరిస్థితి మారాలి. ఎంత వ్యయమైనప్పటికీ వారిని ఈ దుస్థితి నుంచి బయటపడేయాలి. గిరిజనుల బాగుకోసం ఏర్పాటుచేసిన ఐ.టి.డి.ఎ., సంబంధిత విభాగాల్లో సేవాభావం కలిగిన వారిని నియమించి ఆ వ్యవస్థను పటిష్టపరచాలి’’ పవన్ తెలిపారు.
‘‘అత్యవసర ఆరోగ్య సమయాలలో అడవిబిడ్డల కోసం ఎయిర్ అంబులెన్సుల ఏర్పాటుపై కార్యాచరణ చేయాలి. ఆరు కిలోమీటర్ల పర్యటనకు హెలికాప్టర్ ఉపయోగిస్తున్నప్పుడు ఒక ప్రాణాన్ని కాపాడడానికి హెలికాప్టర్ ను ఉపయోగించడం భారమైన పని కాదు. అదేవిధంగా గిరిజన బాలబాలికలకు విద్య అందుబాటులో ఉంచాలి.. గిరిపుత్రులు వారు కోరుకున్న జీవితాన్ని కొనసాగించడానికి కావలసిన కనీస అవసరాలను ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. గిరిజన లోకంలో చైతన్యం వెల్లివిరియాలని, వారు సుఖశాంతులతో జీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా’’ అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
Also Read: Gruha Lakshmi scheme: గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ, అసత్య ప్రచారాలు నమ్మొద్దు!