బియ్యం అక్రమ రవాణాకు డీప్ నెట్వర్క్ పనిచేస్తోందని, దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టబోమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాకినాడ పోర్టు (Kakinada Port) నుంచి రేషన్ బియ్యం(Ration Rice) అక్రమ రవాణా జరుగుతుండడం పై పవన్ సీరియస్ అయ్యారు. కాకినాడలోని యాంకరేజీ పోర్ట్ నుంచి పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధమైన స్టెల్లా ఎల్ నౌకలో 640 టన్నుల బియ్యంతో పాటు అదే పోర్టులో మరో నౌకలోకి బియ్యం ఎక్కించేందుకు వెళ్తున్న బార్జ్ ఐవీ 0073లో ఉన్న 1064 టన్నుల బియ్యాన్ని బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ గుర్తించారు. పేదలకు పంపిణీ చేసే బియ్యం (పీడీఎస్) అడ్డదారిన కాకినాడ పోర్టు ద్వారా తరలిపోతోందని జిల్లా కలెక్టర్‌కు పక్కాగా సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకొని సుమారు 52 వేల టన్నుల సామర్థ్యం ఉన్న ఈ నౌకలో 38 వేల టన్నుల బియ్యం లోడ్ కాగా అందులో 640 టన్నులు పీడీఎస్ బియ్యం అని గుర్తించారు.
ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan), మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) తనిఖీలు చేపట్టారు. ఎగుమతికి సిద్ధంగా ఉంచిన రేషన్ బియ్యాన్ని పవన్ కల్యాణ్ పరిశీలించారు. పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ పోర్టు నిర్వాహకుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. బియ్యం స్మగ్లింగ్ చేస్తుంటే ఏం చేస్తున్నారంటూ డీఎస్పీ రఘువీర్ విష్ణువు, ఎమ్మెల్యే కొండబాబుని పవన్ కల్యాణ్ నిలదీశారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. రేషన్ బియ్యం స్మగ్లింగ్ కు మూలాలు చాలా బలంగా ఉన్నాయన్నారు. రేషన్ రైస్ స్మగ్లింగ్ ను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. బియ్యం అక్రమ రవాణపై ఫిర్యాదులు వచ్చినా నామమాత్రంగా చర్యలు తీసుకుంటున్నారు అని పవన్ వాపోయారు. కాకినాడ పోర్టుకు వస్తానంటే కొందరు నన్ను రావద్దన్నారు అని పవన్ తెలిపారు. డిప్యూటీ సీఎంగా ఉన్న నాకే పోర్టు అధికారులు సహకరించలేదని వాపోయారు. కాకినాడ పోర్టు దగ్గర సరైన సెక్యూరిటీ లేదన్నారు. ఉగ్రవాదులు వచ్చి కాల్చేస్తే ఇక్కడ దిక్కు లేదన్నారు. ప్రజాప్రతినిధులు వచ్చి బియ్యం అక్రమ రవాణా ఆపితేగానీ మీరు ఆపలేరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం అక్రమ రవాణాలో ఎవరు ఉన్నా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రేషన్ బియ్యం ఇష్టానుసారం తరలిస్తున్నవారు ఎంతవారైనా చర్యలు తీసుకోవాలని అన్నారు.
మన రాష్ట్రానికి సముద్రతీరం చాలా లాభదాయకమని పవన్ అన్నారు. సముద్రతీరం ఎంత లాభమో, అంత నష్టం కూడా ఉందని, మన తీరప్రాంతాల్లో మారిటైమ్ భద్రత సరిగా లేదని పేర్కొన్నారు. రేషన్ బియ్యం పేదప్రజలకు మాత్రమే అందాలన్న పవన్, కిలో రేషన్ బియ్యానికి సుమారు రూ.43 ఖర్చు అవుతోందని వెల్లడించారు. రేషన్ బియ్యం వేలమందికి ఉపాధిగా మారిందని, కోర్టులకు వెళ్లి తన పైనే ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. పోర్టు సీఈవోకు నోటీసులు పంపాలని, ఓడను సీజ్ చేయాలని ఆదేశించారు. కిలో రేషన్ బియ్యాన్ని రూ.73కు అమ్ముతున్నారని తెలిసిందని పవన్ అన్నారు. కొందరు వ్యాపారులు రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేస్తూ రూ.వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. రేషన్ బియ్యం అక్రమాలు, అవినీతిని అరికడతామన్న పవన్, పారదర్శక పాలన అందిస్తామని ప్రజలకు మాటిచ్చామని గుర్తు చేశారు.