జనసేన అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఔదార్యాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటన సందర్భంగా జరిగిన “అడవి తల్లిబాట” (Adavi Thalli Bata) కార్యక్రమంలో పాల్గొన్న పవన్, గిరిజనుల సంప్రదాయ నృత్యాలు, వారి సంస్కృతి ని సమీక్షించారు. అక్కడే మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో రహదారుల కొరత వల్ల ప్రజలు డోలీ కట్టి నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, ఇది తన మనసును తాకిన విషయమని చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చాక రహదారుల అభివృద్ధే ఈ సమస్యకు పరిష్కారమని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు.
AP Govt : ఆక్వా సంక్షోభంపై కమిటీ ఏర్పాటు.. త్వరలో ఢిల్లీకి సీఎం చంద్రబాబు
ఈ లక్ష్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి నిధుల మంజూరుకు విజ్ఞప్తి చేసినట్టు పవన్ తెలిపారు. తన అభ్యర్థనపై ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చంద్రబాబు వెంటనే 49 కోట్ల రూపాయలను మంజూరు చేశారని, 24 గంటల్లోనే ఆ నిధులు ఖాతాల్లోకి చేరాయని చెప్పారు. చంద్రబాబు ఔదార్యాన్ని చూసి తాను కరిగిపోయానని పవన్ పేర్కొన్నారు. గిరిజనులకు సంప్రదాయ విద్య లేదు కావచ్చు కానీ, వారిలో ఉన్న నైపుణ్యాలు ఎంతో గొప్పవని, వారి కళలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయని అన్నారు. వారికి కొంత సాయం చేస్తే, వారు మరింత ముందుకు వెళ్లగలరని చెప్పారు.
వైసీపీ (YCP) పాలనలో రహదారులు పూర్తిగా గోతుల మయం అయ్యాయని విమర్శించిన పవన్ కళ్యాణ్, ఐదేళ్లలో కేవలం 92 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. దీనివల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. అయితే తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేవలం ఒక్క సంవత్సరంలోనే 1,500 కోట్ల రూపాయలు వెచ్చించి, రహదారుల అభివృద్ధికి శంకుస్థాపనలు చేశామని వివరించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ఇది ఒక తొలి అడుగేనని, ముందుకు మరింత వేగంగా సాగుతామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.