Site icon HashtagU Telugu

PK:జగన్ విషయంలో ఎంత బాధపడ్డానో, చంద్రబాబు విషయంలో అంతే బాధపడుతున్నానన్న పవన్ కళ్యాణ్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు తీవ్ర దుమారానికి దారితీశాయని చెప్పవచ్చు. నిండు సభలో తన సహచారిని అసభ్య పదజాలంతో దూషించారంటూ టీడీపీ చీఫ్ చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నారు. ఈ సంఘటనపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు కన్నీరు కార్చడం బాధకరమని అన్నారు.

చంద్రబాబుకు సభలో జరిగిన అవమానాన్ని కండిస్తున్నట్లు పవన్ తెలిపారు. తన భార్యను అవమానించారని, ఆమె గౌరవ మర్యాదలకు భంగం కలిగేలా మాట్లాడారని చంద్రబాబు కంటతడి పెట్టడం బాధ కలిగించిందని పవన్ అన్నారు. రాష్ట్ర రాజకీయాలు ఆవేదన కలిగిస్తున్నాయని పవన్ అన్నారు.
ఓవైపు రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేస్తుంటే అవేమీ పట్టని ప్రజాప్రతినిధులు ఆమోదయోగ్యం కాని విమర్శలు, వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పవన్ విమర్శించారు.

Also Read: వైజాగ్‌కు మరో గండం

కొద్దిరోజులుగా సభల్లో, సమావేశాల్లో, చివరికి టీవీ చానళ్ల చర్చా కార్యక్రమాల్లో కూడా వాడుతున్న భాష సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందని పవన్ అభిప్రాయపడ్డారు.
తాజాగా గౌరవ శాసనసభలో విపక్ష నేత కుటుంబ సభ్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత శోచనీయమని పవన్ అభిప్రాయపడ్డారు.

Also Read: మూడోసారి సీఎం కోసం మ‌మ‌త త‌ర‌హాలో కేసీఆర్

గతంలో ప్రస్తుత సీఎం జగన్ కుటుంబ సభ్యులను కూడా కొందరు తక్కువ చేసి మాట్లాడినప్పుడు తాను ఇలాగే ఖండించానని గుర్తు చేసిన పవన్,
ఇప్పుడు చంద్రబాబు అర్ధాంగిపై చేసిన వ్యాఖ్యలను కూడా ఖండిస్తున్నానని అన్నారు.
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు మహిళల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలని, మహిళల గౌరవ మర్యాదలకు భంగం కలిగించే ధోరణులను జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఇటువంటి దిగజారుడు రాజకీయాలను ప్రతి ఒక్కరూ ఖండించకపోతే, ee పరిస్థితి ఒక అంటువ్యాధిలా విస్తరించే ప్రమాదముందని పవన్ హెచ్చరించారు.