Site icon HashtagU Telugu

Parliament Protection : పార్లమెంటుకే రక్షణ లేదా?

Parliament Is Not Protected...

Parliament Is Not Protected...

By: డా. ప్రసాదమూర్తి

Andhra Pradesh Parliament is not protected? : డిసెంబర్ 13. ఎప్పుడో 22 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున పార్లమెంటు భవనం పై ఉగ్రవాదుల దాడి జరిగింది. సరిగ్గా అదే రోజున డిసెంబర్ 13, 2023న భారత నూతన పార్లమెంటులో (Parliament) ఇద్దరు ఆగంతక యువకులు ప్రవేశించి అల్లకల్లోలం సృష్టించారు. దేశ రక్షణ గురించి, దేశ సరిహద్దుల గురించి, విదేశీ చొరబాటుదారుల దురాక్రమణాల గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు దంచి, దేశాన్ని రక్షించడానికి మేమున్నామంటూ 56 అంగుళాల ఛాతీ ప్రదర్శనలో అగ్రగామిగా నిల్చున్న మన నేతలు, జరిగిన ఈ ఘటన మీద ఏమని వ్యాఖ్యానిస్తారు? ఎలా సమర్థించుకుంటారు? పాత భవనం నుంచి కొత్త భవనంలోకి వెళ్లేటప్పుడు చేసిన హంగామా, జరిగిన తతంగం, దేశమే కాదు ప్రపంచమే చూసింది.

రాజ దండానికి ఎలాంటి పూజలు జరిగాయో, ఆ సందర్భంగా హాలీవుడ్ మూవీ రేంజ్ లో ఎలాంటి షూటింగ్ జరిగిందో, ఇక రాజదండం ఉంది రాజు ఉన్నాడు మనకేం పరవాలేదు అన్న భరోసా ఇవ్వడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నాయకులు, సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా ఎన్ని ప్రయత్నాలు చేశారో మనకు తెలుసు. కానీ మనం సరిహద్దుల్లో ఎంత భద్రంగా ఉన్నామనే దానికంటే దేశాన్ని కాపాడే నాయకులు కొలువై ఉన్న పార్లమెంటు భవనమే భద్రత కరువై భయం భయంగా ఉందన్న సంగతి నిన్న పార్లమెంట్లో (Parliament) జరిగిన ఘటన కళ్ళకు కట్టిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

అసలేం జరిగింది?

లోక్ సభలో అధికార పార్టీ, విపక్ష పార్టీల సభ్యులంతా పార్లమెంటు కార్యకలాపాలలో మునిగి ఉండగా ఒక యువకుడు ప్రేక్షకుల గ్యాలరీ నుంచి పార్లమెంటు సభ్యులు కూర్చునే చోటికి దూకాడు. దూకడమే కాదు ఒక టేబుల్ మీద నుంచి మరో టేబుల్ కి కోతిలా గెంతుతూ అధ్యక్ష పీఠం వైపు వెళ్ళాడు. ఇంతలో కొందరు పార్లమెంట్ సభ్యులు అతన్ని పట్టుకొని సమూహంగా అతన్ని చితక బాదారు. అంతలోనే అతను వేసుకున్న బూట్లు నుంచి పసుపు రంగులో ఉన్న పొగలాంటి గ్యాస్ రిలీజ్ చేశాడు. ఇది జరుగుతూ ఉండగానే మరో యువకుడు ప్రేక్షకుల గ్యాలరీ నుంచి కిందకు దూకి అతను కూడా ఇదే సీన్ రిపీట్ చేశాడు. సరే అతన్ని కూడా పట్టుకున్నారు. వాళ్ళిద్దర్నీ పట్టుకున్న వాళ్ళు ఒకరు కాంగ్రెస్ ఎంపీ, మరొకరు ఆర్ఎల్పీ ఎంపీ అని తెలుస్తుంది. అందరూ కలిసి వాళ్ళకి దేహశుద్ధి చేయడంలో మాత్రం పార్టీ విభేదాలు చూపించలేదు.

ఎవరీ యువకులు?

లోపల ఈ ఘటన జరుగుతుండగా పార్లమెంటు బయట ఒక యువతి గట్టిగా నినాదాలు చేస్తూ పట్టుబడింది. ఆమెకు వెనక కొందరు యువకులు ఉన్నట్టు మీడియా రిపోర్టు. ఆమె నిరుద్యోగానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నట్టు, రైతుల పక్షాన మాట్లాడుతున్నట్టు, తానాషాహి నహీ చెలేగీ అంటూ ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్టు తెలుస్తోంది. ఆమెను బయట పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. అసలు వీరంతా ఎవరు? పార్లమెంటు ప్రాంగణంలోకి, సరాసరి పార్లమెంటులోకి ఎలా ప్రవేశించారు అనేవి అసలు ప్రశ్నలు. పార్లమెంట్లో ఇంత హంగామా సృష్టించి పసుపు పచ్చని పొగ వ్యాపింపజేసి మొత్తం దేశాన్ని కలవరపరిచిన ఆ యువకుడు సాగర్ శర్మ అని తెలిసింది. అతనిది మైసూర్. పార్లమెంట్లో ప్రవేశించడానికి ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చోవడానికి అనుమతి అవసరం. మరి వీరికి అనుమతి ఎవరు ఇచ్చారు అంటే బిజెపికి చెందిన ప్రతాప్ సిన్హా అనే ఎంపీ వీరికి పాసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇలాంటి వారికి సాక్షాత్తు అధికారంలో ఉన్న పార్టీ ఎంపీనే ఎలా పాస్ లు జారీ చేశాడు? అసలు విషయం బయట పడాల్సి ఉంది.

దీనికంటే భద్రతలో చాలా అత్యద్భుత అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ముందున్నామని అలనాడు కొత్త పార్లమెంటు భవనం ఆవిష్కరణ సందర్భంలో మీడియా వాయించి కొట్టింది. మరి ఇంత జరుగుతున్నా అసలు భద్రతా బలగాలు ఏమయ్యాయి? పార్లమెంటులోకి ఆ దుండగులు ఎలా ప్రవేశించగలిగారు? వారు తాము వేసుకున్న బూట్లలో ఆ గ్యాస్ ఎలా దాచుకోగలిగారు? దీన్ని మన భద్రతా బలగాలు ఎలా కనిపెట్టలేకపోయాయి? ఒకవేళ ఆ గ్యాస్ ఏ విషపూరితమైనదైనా అయితే మన నాయకులు ఏమయ్యే వారు? మన పార్లమెంటు భవనం ఏమయ్యేది? మన పార్లమెంటు ప్రజాస్వామ్యం ఏమయ్యేది? ప్రపంచం ముందు మన దేశం ఎలా తలెత్తుకొని నిలబడేది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినది బాధ్యులైనటువంటి పాలక మహాశయులే.

ఈ ఆగంతకులకు ఎంట్రీ పాసులు ఇచ్చింది అధికార పార్టీ ఎంపీ కాబట్టి సరిపోయింది అదే ఏ ప్రతిపక్ష పార్టీ ఎంపీ ఇచ్చినా ఈపాటికి ఏం జరిగేదో మనం ఊహించుకోవచ్చు. ఇదంతా ఎలా ఉన్నా, 56 అంగుళాల రక్షా కవచాన్ని ఈ తాజా ఉదంతం తూట్లు తూట్లు పొడిచింది. దీన్ని ఏ రకంగా మరమ్మత్తు చేసుకుంటారో చూడాలి. ‌

Also Read: Deputy CM Bhatti : అధికారిక నివాసంలో అడుగు పెట్టిన భట్టి ..పలు ఫైల్స్ ఫై సంతకాలు