Deputy CM Pawan Kalyan : ఏపీ వ్యాప్తంగా రేపటి నుంచి పల్లె పండుగ వారోత్సవాలను నిర్వహించేందుకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సిద్ధమైంది. రాష్ట్రంలోని 13,324 గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహించి, గ్రామీణ అభివృద్ధికి పెద్దపీట వేసేలా అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా జరిగే పల్లె పండుగ వారోత్సవాలలో భాగంగా కృష్ణా జిల్లా కంకిపాడులోని ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొంటారు. అక్టోబర్ 14 నుంచి 20 వరకు 7 రోజుల పాటు జరిగే వారోత్సవాల కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 4,500 కోట్ల నిధులతో 30,000 పనులను చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పనులలో 3,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల తారు రోడ్లు, వ్యవసాయ కుంటలు, పశువుల శాలలు, ఇంకుడు గుంతల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులను చేపట్టనున్నారు.
Read Also: Madhusudana Chari : మండలిలో ప్రతిపక్ష నేతగా మధుసూదనచారి బాధ్యతలు
గ్రామాల అభివృద్ధిని ప్రోత్సహించడమే కాకుండా.. గ్రామ ప్రజల మధ్య సత్సంబంధాలను మరింత మెరుగుపరిచేందుకు ఈ పల్లె పండుగ కార్యక్రమం ఎంతగానో తోడ్పడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ వారోత్సవాలు బలమైన గ్రామీణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపకల్పనకు పునాది వేస్తుందని భావిస్తున్నారు. గ్రామీణ స్థాయిలో వ్యవసాయ, నీటి, రవాణా వ్యవస్థలను మరింత బలోపేతం చేయడం జరుగుతుందని చెబుతున్నారు. ఇందులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా గ్రామాల్లో ఆర్థిక చలనం వలస కలిగే ప్రయోజనాలను విస్తృత ప్రచారం చేసినట్లవుతుందని అంచనా వేస్తున్నారు.
కాగా, గ్రామాల్లో నివాసం ఉంటున్న కుంటుంబాలకు ఏడాదిలో కనీసం 100 రోజులు వేతన ఉపాధి, మెరుగైన జీవనోపాధి కల్పన చేశామని పవన్ వ్యాఖ్యానించారు. ఈ 100 రోజుల్లో ఉపాధి హామీ కూలీలకు 466.13 లక్షల పనిదినాలను కల్పించామని చెప్పారు. 1.07 లక్షల కుటుంబాలకు 100 రోజుల పని దినాలని పూర్తి చేసినట్లు తెలిపారు. పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు మంజూరైన పనులకు పండుగ వాతావరణంలో భూమిపూజ చేస్తున్నామన్న పవన్.. ఉపాధి, ఆర్థిక సంఘం నిధులతో నిర్మాణాలు, సంక్రాంతికల్లా పూర్తి చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధులు వారి వారి నియోజకవర్గాల్లో పాల్గొంటారు. ఆయా నియోజకవర్గాల్లో కేటాయించిన పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ పల్లె పండగ- పంచాయతీ వారోత్సవాలను నిర్వహించడంతో ఎంపీడీఓలు కార్యక్రమాలను నిర్వహణ చేస్తున్నారు.