Srikalahasti : శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇంచార్జిగా ఉన్న కోట వినుతపై తీవ్ర ఆరోపణలు వెలువడుతున్నాయి. ఆమె వ్యక్తిగత సహాయకుడు (పీఏ)గా, డ్రైవర్‌గా పనిచేసిన చెన్నైకి చెందిన సీహెచ్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు ఇటీవల అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యారు. ఈ కేసు దర్యాప్తులో ఉన్న చెన్నై పోలీసులు వినుతతో పాటు ఆమె భర్త చంద్రబాబును అరెస్టు చేశారు. పార్టీకి తీవ్ర అపఖ్యాతి వచ్చే పరిస్థితుల్లో జనసేన నేతృత్వం ఆమెను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. చెన్నైలోని ఓ మురికి కాలువలో గుర్తు తెలియని మృతదేహం దొరకడంతో మింట్ పోలీస్ స్టేషన్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పరిశీలించగా, చేతిపై జనసేన గుర్తు టాటూ ఉండటంతో పోలీసులు ఆ దిశగా విచారణ జరిపారు. మృతుడు గతంలో కోట వినుతకు పీఏగా పనిచేసిన శ్రీనివాసులనే అని గుర్తించారు.
Read Also: Stag Beetle : ఈగ ఖరీదు రూ. 75 లక్షలు..! ఎందుకు అంత..? దాని ప్రత్యేకతలు ఏంటి..?
వద్ద బొక్కసంపాలెం గ్రామానికి చెందిన రాయుడు గతంలో వినుతకు పీఏగా, డ్రైవర్‌గా పని చేశారు. అయితే, గత నెలలో అకస్మాత్తుగా ఆయనను విధుల నుంచి తొలగించారు. ఆ వెంటనే వినుత తరపున పత్రికలో ప్రకటన ఇస్తూ, రాయుడుతో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. సోషల్ మీడియాలోనూ ఇదే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ, ఈ ప్రకటనల కేవలం పదిహేను రోజుల్లోనే రాయుడు శవమై కనపడటంతో పోలీసులకు అనుమానం పెరిగింది. చెన్నై పోలీసులు ఈ హత్య కేసులో విచారణను వేగవంతం చేశారు. కోట వినుతతో పాటు ఆమె భర్త చంద్రబాబు, మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు ప్రకారం ఇది ముందే ప్రణాళికాబద్ధంగా జరిగిన హత్యగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన జనసేన పార్టీ, వినుతను తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించామని ప్రకటించింది. పార్టీకి చెందిన కాన్ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్ హెడ్ వేముపాటి అజయ్ కుమార్ ఈ విషయమై ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
అందులో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న కోట వినుత వ్యవహార శైలి పార్టీ విధి విధానాలకు విరుద్ధంగా ఉన్నందున గత కొంత కాలంగా ఆమెను పార్టీ కార్యక్రమాలనుంచి దూరంగా ఉంచాం. ఇప్పుడు ఆమెపై హత్య కేసు నమోదైన నేపథ్యంలో ఆమెను జనసేన పార్టీ నుంచి పూర్తిగా బహిష్కరిస్తున్నాం అని పేర్కొన్నారు. ఈ ఘటనతో పాటు మరెన్నో రాజకీయ నాయకులపై వ్యక్తిగత స్థాయిలో ఆరోపణలు రావడం గమనార్హం. పార్టీ ప్రమాణాలకు భిన్నంగా వ్యవహరించే నేతలపై కఠిన చర్యలు తీసుకోవడమే జనసేన లక్ష్యమని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఇదిలా ఉండగా, రాయుడు హత్య వెనుక మరెవ్వరైనా ఉన్నారా? ఇదేమైనా రాజకీయ కుట్రా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు కోట వినుతకు మద్దతుగా కొందరు కార్యకర్తలు ముందుకు రావడం కూడా పార్టీకి కొత్త చికాకులను తెచ్చిపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.
Read Also: IIM Calcutta : కోల్‌కతాలో మరో ఘోరం.. హాస్టల్‌లో విద్యార్థినిపై అత్యాచారం