Site icon HashtagU Telugu

Opposition Patna Meet : బీజేపీకి జీ హుజూర్! తెలుగోడి అధైర్యం!!

Opposition Patna Meet

Opposition Patna Meet

Opposition Patna Meet :  ఒక‌ప్పుడు తెలుగోడంటే ఢిల్లీ గ‌డ‌గ‌డ‌లాడేది. ఇప్పుడు ఢిల్లీ చెప్పిన‌ట్టు తెలుగు లీడ‌ర్లు ఆడుతున్నారు. ప్ర‌ధాన పార్టీల అధినేత‌లు బీజేపీ దెబ్బ‌కు పిల్లులా మారారు. పాట్నాలో జ‌రిగిన విప‌క్షాల మీటింగ్ కు హాజ‌ర‌య్యే ద‌మ్ములేని నాయ‌కులుగా ఉన్నారు. అందుకే, ఆ పార్టీల అధిప‌తుల‌కు ఆహ్వానం కూడా పంప‌లేదు. తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలు బీజేపీకి కొమ్ముకాస్తున్నాయ‌ని దేశంలోని విప‌క్షాల‌న్నీ భావించాయి. అందుకే, ఆహ్వానం కూడా పంప‌కుండా దాటేశారు. శుక్ర‌వారం పాట్నా వేదిక‌గా జ‌రిగిన విప‌క్షాల స‌మావేశంలో తెలుగు లీడ‌ర్ల ప్రాతినిధ్యం లేక‌పోవ‌డం గ‌మనార్హం.

విప‌క్షాల మీటింగ్ కు హాజ‌ర‌య్యే ద‌మ్ములేని నాయ‌కులు (Opposition Patna Meet)

ఏపీలోని తెలుగుదేశం పార్టీ, వైసీపీకి నేరుగా బీజేపీతో పొత్తులేదు. అయిన‌ప్ప‌టికీ రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఆ రెండు పార్టీలు బీజేపీ నిలిపిన అభ్య‌ర్థుల‌కు మ‌ద్ధ‌తు ప‌లికారు. గ‌త నాలుగేళ్లుగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కేంద్రంలోని బీజేపీకి వ‌త్తాసు ప‌లుకుతున్నారు. ప్ర‌త్యేక హోదాను దేవుడికి వ‌దిలేశారు. విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌ను అడిగే ధైర్యం కూడా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేయ‌డంలేదు. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కార్ ను ప‌న్నెత్తి మాట అన‌డానికి కూడా ముందుకు రాలేని దుస్థితిలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉన్నారు. ఇక 2019 ఎన్నిక‌ల్లో బీజేపీని విభేదించిన చంద్ర‌బాబు ఇప్పుడు ఆ పార్టీకి ద‌గ్గ‌ర‌వుతున్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ విజ‌న్ ను ప్ర‌శంసిస్తున్నారు. జ‌న‌సేనాని ప‌వ‌న్ ప్ర‌స్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నారు. అలా, ఏపీలోని మూడు ప్ర‌ధాన పార్టీలు బీజేపీని కాద‌ని ఒక అడుగు కూడా వేయ‌లేని ప‌రిస్థితిలో ఉన్నాయి. అందుకే, విప‌క్షాల స‌మావేశానికి టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన‌కు ఆహ్వానం లేదు.

బీజేపీని విభేదించిన చంద్ర‌బాబు ఇప్పుడు మోడీ విజ‌న్ ను ప్ర‌శంసిస్తున్నారు

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌స్తుతం కాంగ్రెస్, బీజేపీల‌కు స‌మ‌దూరం అంటున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్ర‌భుత్వాన్ని దించేయాల‌ని కోరుకుంటున్నారు. అందుకోసం టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చేశారు. కొంత కాలం పాటు కాలికిబ‌ల‌పం క‌ట్టుకుని దేశంలోని కీల‌క లీడ‌ర్ల‌తో భేటీ అయ్యారు. ఆర్థికంగా ఆయా రాష్ట్రాల్లోని పార్టీల‌కు స‌హాయం చేస్తాన‌ని హామీ ఇచ్చార‌ట‌. కానీ, హ‌ఠాత్తుగా ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు బీజేపీతో మిలాఖ‌త్ అయ్యార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. అందుకే, క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పోటీకి దిగలేదు. ఆ విష‌యాన్ని గ‌మ‌నించిన కాంగ్రెస్ సీఎం సిద్ధిరామ‌య్య ప్ర‌మాణ‌స్వీకారానికి బీఆర్ఎస్ ను ఆహ్వానించ‌లేదు. దేశంలోని విప‌క్షాలు కూడా కేసీఆర్ ను న‌మ్మ‌లేదు. బీజేపీకి బీ టీమ్ గా బీఆర్ఎస్ ఉంద‌ని విశ్వ‌సిస్తున్నారు. అందుకే, కేసీఆర్ కు ఆహ్వానం ఇవ్వ‌లేదు.

Also Read : BJP: బీజేపీ అలర్ట్, ఢిల్లీకి ఈటల, కోమటిరెడ్డి!

పాట్నాలో లోక్‌సభ ఎన్నికల కోసం బిజెపి వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటుకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి విప‌క్షాల స‌మావేశం శుక్ర‌వారం జ‌రిగింది. దానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ముఖ్యఅతిథిగా వ్య‌వ‌హ‌రించారు. కాంగ్రెస్, ఆప్, ఎన్సీపీ, టీఎంసీ తదితర 27 రాజకీయ పార్టీలు హాజ‌రు కావ‌డం గ‌మ‌నార్హం. స‌మావేశానికి ముందుగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా బీజేపీని ఓడించబోతున్నాయ‌ని అన్నారు. ఒకవైపు కాంగ్రెస్‌ ‘భారత్‌ జోడో’ సిద్ధాంతం, మరోవైపు బీజేపీ, ఆరెస్సెస్‌ ‘భారత్‌ టోడో’ సిద్ధాంతం ఉందని రాహుల్ పోల్చారు. మ‌రోసారి జూలై 12, 13 తేదీల్లో స‌మావేశం కావాల‌ని విప‌క్షాల తీర్మానంతో ఆ స‌మావేశం ముగిసింది. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లోని విప‌క్షాల స‌మావేశ‌మైన పాట్నా వేదిక‌పై తెలుగు రాష్ట్రాల ప్ర‌ధాన పార్టీలు లేక‌పోవ‌డంపై చ‌ర్చ జ‌రుగుతోంది.

Also Read : PM Modi In US Congress: త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ప్రధాని నరేంద్ర మోదీ