Site icon HashtagU Telugu

Operation Garuda: రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ గరుడ.. 100 బృందాలతో తనిఖీలు

Operation Garuda

Operation Garuda

Operation Garuda: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నిర్ధేశానుసారం ఈగల్ టీమ్ ఐజీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్, స్థానిక పోలీసు లు, డ్రగ్స్ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో టీమ్‌గా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి డ్రగ్స్ దుర్వినియోగంపై మెడికల్ షాపులు, మెడికల్ ఏజెన్సీల పై దాడులు నిర్వహించామని ఈగల్ (ఎలైట్ యాంటీ-నార్కొటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్) ఐజీ ఆకే రవి కృష్ణ, తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో, హోం మంత్రి వంగలపూడి అనిత సూచనలకు అనుగుణంగా ఆపరేషన్ గరుడ (Operation Garuda)ను చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర డిజిపి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా నిలపడమే లక్ష్యం పనిచేస్తున్నారన్నారు. ఈ సందర్బంగా గుణదలలో మందుల షాపు వద్ద పాత్రికేయులతో ఈగల్ ఐజీ ఆకే రవి కృష్ణ మాట్లాడుతూ ఈ తనిఖీలకు ఆపరేషన్ గరుడ అని పేరు పెట్టడం జరిగిందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 100 బృందాల ఆధ్వర్యంలో ఆపరేషన్ గరుడ ను నిర్వహించినట్లు తెలిపారు. ఆపరేషన్ గరుడ లో భాగంగా శుక్రవారం ఉదయం గుణదలలో గల ముందుల షాపులో ఆకస్మిక తనిఖీ చేయడం జరిగిందన్నారు. మెడికల్ షాప్స్ లో ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వకూడదని అటువంటి మందుల అమ్మకం జరుగుతుందేమో పరిశీలిస్తున్నామన్నారు. ALBENDAZOLE వంటి కొన్ని మత్తు ఇచ్చే టాబ్లెట్స్ ఇంజక్షన్స్ ను కొనుగోలు చేసి యువత బానిసలుగా మారుతున్నారు.. గంజాయిని కట్టడి చేస్తున్న నేపథ్యంలో యువత ఈవిధమైన నిబంధనలకు విరుద్ధంగా మందులను కొనుగోలు చేసి వినియోగిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. గతంలో కంటే కట్టుదిట్టంగా ఎన్ డి పి ఎస్ యాక్ట్ ను అమలు చేస్తామన్నారు. యువత ఇలాంటి మత్తు టాబ్లెట్ లకు బానిసలు కాకుండా ఉండాలని వారికి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు జరిపి ఇటువంటి అమ్మకాలు జరుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈగల్ ఐజీ ఆకే రవి కృష్ణ తెలిపారు.

Also Read:Shardul Thakur: ల‌క్నో జ‌ట్టులోకి టీమిండియా స్టార్ ఆల్ రౌండ‌ర్‌?

డ్రగ్స్ డైరెక్టర్ ఎంబీఆర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్న మెడికల్ షాపులపై చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతి లేని మందులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మందులకు సరిగా బిల్లులు ఇవ్వని వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రిస్క్రిప్షన్ మీద అమ్మవలసిన మందులు మాత్రమే మందుల షాపులో విక్రయించాలన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మందులు అమ్మే మెడికల్ షాపులపై చర్యలు తీసుకుంటామన్నారు.