CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారాలు తాత్కాలికమని, కానీ అభివృద్ధికి సంబంధించి చేపట్టిన పనులు శాశ్వతమవుతాయన్నారు. కుప్పంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, తాను ఎప్పుడూ తప్పుడు ఆరోపణలతో రాజకీయాలు చేయలేదని స్పష్టం చేశారు. కారు కింద పడ్డ మనిషిని కుక్కపిల్లలా పక్కకు నెట్టేసి పోతారా? కంపచెట్లలో పడేసి వెళ్లడమంటే మానవత్వం ఉందా? సామాజిక స్పృహ లేకుండా ఇలా ప్రవర్తించడాన్ని ఎలా న్యాయబద్ధీకరిస్తారు? అంటూ సీఎం తీవ్రంగా స్పందించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక మహిళను బెదిరించడం, కుటుంబాలను లక్ష్యంగా చేసుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఏమీ చేయలేని వాళ్లు శవ రాజకీయాలు చేస్తారుఅంటూ ఆయన ధ్వజమెత్తారు.
Read Also: Jagan : జగన్ ప్లాన్ బెడిసికొట్టింది.
బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకత అనవసరమని, ఇది ఎలాంటి నష్టాన్ని కలిగించదని సీఎం చంద్రబాబు వివరించారు. గోదావరిలో ప్రతి సంవత్సరం సగటున 2వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని, అందులో 200 టీఎంసీలను వినియోగించినా ఎవరికీ నష్టం లేకుండా తెలుగువారికి మేలు జరుగుతుందని తెలిపారు. ఈ విషయాన్ని పదే పదే చెబుతున్నా. కానీ కొన్ని వర్గాలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి అని పేర్కొన్నారు. తెలంగాణలో గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టులను తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని, ఎప్పటికీ వ్యతిరేకించబోనని స్పష్టం చేశారు. నీటి వనరుల సమర్థ వినియోగంతో రాష్ట్రానికి మేలు చేస్తామని చెప్పారు. రాయలసీమ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు విశేషంగా దృష్టి సారించామని తెలిపారు. ఒక్కసారిగా రూ. 3,950 కోట్లు హంద్రీనీవా ప్రాజెక్టుకు విడుదల చేశామని చెప్పారు.
మైక్రో ఇరిగేషన్ పథకానికి 90 శాతం సబ్సిడీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నామని వివరించారు. వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు వాణిజ్య పంటలను ప్రోత్సహిస్తున్నాం. వాణిజ్య పంటల్లో ఒక్కోసారి ధరలు తగ్గినా, రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నాం అని ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, వారు ఒక్క బిడ్డ ఉన్న తల్లికే అమ్మఒడి ఇచ్చారన్నారు. కానీ తమ ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లిని గౌరవిస్తూ అందరికీ సాయంగా నిలుస్తోందన్నారు. మేము తల్లికి వందనం చేస్తున్నాం. రైతుకు బాసటగా నిలుస్తున్నాం. ఇది మా పాలన విధానం అంటూ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక, ప్రజలు తప్పుడు ప్రచారాలకు లోనుకాకుండా, అభివృద్ధి పథంలో సాగుతున్న నిజాన్ని గుర్తించాలని ఆయన పిలుపునిచ్చారు.
Read Also: Konda Murali : నాకు ప్రజాబలం ఉంది..చాలా కేసులకే నేను భయపడలేదు: కొండా మురళి