ఈ ఏడాది ఉల్లి రైతులను (Onion Prices) ధరలు తీవ్రంగా నిరాశపరుస్తున్నాయి. పంట దిగుబడి బాగానే ఉన్నప్పటికీ, మార్కెట్లో ఉల్లి ధరలు భారీగా పడిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. తెలంగాణలో కిలో ఉల్లికి కేవలం రూ.5 నుంచి రూ.16 మాత్రమే లభిస్తుండగా, అదే ఉల్లి వినియోగదారులకు రూ.25 నుంచి రూ.45 వరకు అమ్ముడవుతోంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట పండించడానికి చేసిన ఖర్చు కూడా వెనక్కి రావడం లేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
Congress : ప్రభుత్వం మారితేనే న్యాయం జరుగుతుందేమో..? – రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి కూడా భిన్నంగా లేదు. అక్కడి మార్కెట్లలో క్వింటాల్ ఉల్లి ధర కనిష్టంగా రూ.501, గరిష్టంగా రూ.1,249 మాత్రమే పలుకుతోంది. దీంతో రైతుకు కిలో ఉల్లికి కేవలం రూ.5 నుంచి రూ.12 మాత్రమే దక్కుతోంది. చాలా చోట్ల, మార్కెట్లలో ఉల్లి నిల్వలు పేరుకుపోయి, కొనుగోళ్లు కూడా నిలిచిపోయాయి. దీనివల్ల రైతులు తాము పండించిన పంటను అమ్ముకోలేక, పారబోయలేక ఇబ్బందులు పడుతున్నారు. వినియోగదారుల నుంచి రైతుల వద్దకు వచ్చేసరికి ధరల్లో ఇంత భారీ వ్యత్యాసం ఉండడం వెనుక మధ్యవర్తులదే ప్రధాన పాత్ర అని రైతులు ఆరోపిస్తున్నారు.
ఈ సంక్షోభం నుంచి తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని, మధ్యవర్తుల దోపిడీని అరికట్టాలని వారు కోరుతున్నారు. రైతుల పంటకు సరైన ధర లభించకపోతే, భవిష్యత్తులో ఉల్లి సాగును తగ్గించే అవకాశం ఉందని, ఇది వినియోగదారులకు మరింత ఇబ్బందులు సృష్టించవచ్చని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.