Site icon HashtagU Telugu

YCP vs TDP : టీడీపీ ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్‌..!

Ongole

Ongole

ఒంగోలు కార్పొరేషన్‌ పాలకవర్గం వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీకి దక్కే అవకాశం కనిపిస్తోంది. అధికార పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి నేడో, రేపో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. శనివారం మరో కార్పొరేటర్ టీడీపీలో చేరడంతో కూటమి సభ్యుల సంఖ్య 13కి చేరింది. తాజాగా ఎమ్మెల్యే దామచర్ల కార్పొరేషన్ పై దృష్టి పెట్టడంతో మరికొంత మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

We’re now on WhatsApp. Click to Join.

వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంగోలులోని 50 డివిజన్‌లకు గాను 43 డివిజన్లలో పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఆరు డివిజన్లలో టీడీపీ, ఒక డివిజన్‌లో జనసేన అభ్యర్థి విజయం సాధించారు. కార్పొరేషన్‌లో మెజారిటీ సాధించాలంటే టీడీపీకి 26 మంది సభ్యులు కావాలి. ప్రస్తుత 13 మంది సభ్యులతో పాటు ఒంగోలు ఎంపీ మాగుంట, స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌లు కార్పొరేషన్‌లో ఎక్స్‌ అఫీషియో సభ్యత్వం తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

దీనిపై విజయ్‌కుమార్‌తో జనార్ధన్ మాట్లాడినట్లు సమాచారం. ఈ మూడు కలిస్తే కార్పొరేషన్‌లో టీడీపీ బలం 16కు చేరుతుంది. మరో 10 మంది వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరితే ఆ కార్పొరేషన్ టీడీపీ ఆధీనంలోకి వచ్చే అవకాశం ఉంది. శనివారం నాటి పరిణామాలతో పలువురు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అలాంటి కార్పొరేటర్ల సంఖ్య 10 నుంచి 15 వరకు ఉంటుంది. వారిలో ఒకరిద్దరు జనసేన ద్వారా టీడీపీ కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.

చాకచక్యంగా రాజకీయాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే జానారెడ్డి కొందరు కార్పొరేటర్లతో నేరుగా, మరికొందరితో పార్టీ నేతల ద్వారా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. మేయర్ గంగాడ సుజాత కూడా పార్టీ మారేందుకు సిద్ధమైనా.. ఆమెను పక్కన పెట్టి టీడీపీ నేతలు నేరుగా కార్పొరేటర్లతో చర్చలు ప్రారంభించారు.

పరిస్థితిని గమనించిన మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి కార్పొరేషన్ పై దృష్టి సారించి కార్పొరేటర్లతో చర్చలు ప్రారంభించినట్లు సమాచారం. ఎన్నికల్లో ఓటమి తర్వాత హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. తాను సోమవారం ఒంగోలు వస్తానని కొందరు వైఎస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్లతో మాట్లాడుతూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు.

వైఎస్సార్సీపీ అధినేత జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలినేని.. ఎలా ముందుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు అందుతున్న సమాచారం. టీడీపీలో చేరాలనుకుంటున్న కొందరు కార్పొరేటర్లు బాలినేని మాటను గౌరవించి సోమవారం తర్వాత నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.

Read Also : KP Sharma Oli : నేపాల్‌ కొత్త ప్రధానిగా కేపీ శర్మ ఓలి