Site icon HashtagU Telugu

OG Ticket : ‘OG’ మూవీ టికెట్ రేట్స్ పెరిగింది..వివాదం మొదలైంది

Og Ticket Onion Price

Og Ticket Onion Price

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ (OG) సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతున్న వేళ టికెట్ ధరల పెంపు నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణంలో పెద్ద చర్చకు దారితీసింది. సాధారణంగా సినిమా బడ్జెట్‌ను బట్టి టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. అయితే ఈసారి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చి, బెనిఫిట్ షో టికెట్ ధరను రూ.1000 (జీఎస్టీతో కలిపి)గా నిర్ణయించగా, విడుదలైన మొదటి పది రోజులు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.125, మల్టీప్లెక్స్‌లలో రూ.150 వరకు పెంచుకునే అవకాశం కల్పించింది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ దీనికి కృతజ్ఞతలు తెలిపినా, ప్రజల్లో, ప్రతిపక్ష పార్టీల్లో విమర్శలు వినిపిస్తున్నాయి.

Asia Cup: మ‌రోసారి భార‌త్‌- పాక్ మ్యాచ్‌.. ఎప్పుడంటే!?

వైసీపీ నేతలు, నెటిజన్లు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. రాష్ట్రంలో ఉల్లి రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతుంటే, ఒక సినిమా టికెట్‌కు వెయ్యి రూపాయలు వసూలు చేయడం దౌర్భాగ్యమని వారు పేర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపణలు చేస్తూ, “పంటకు ధర ఇవ్వని పాలకులు సినిమాకి మాత్రం విలువ ఇస్తున్నారు” అని మండిపడుతున్నారు. వైఎస్ జగన్ పాలనలో రైతుల పట్ల కనీస చిత్తశుద్ధి ఉన్నదని, ఇప్పుడు ఆ లోటు ఏపీ ప్రజలకు అర్థమవుతోందని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక సాధారణ ప్రజలు కూడా ఈ టికెట్ రేట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప 2, గేమ్‌ఛేంజర్, కల్కి వంటి భారీ బడ్జెట్ చిత్రాలకు టికెట్ ధరల పెంపు అర్థవంతమని వారు చెబుతున్నారు. కానీ తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ఓజీ’కి ఇదే స్థాయిలో పెంపు అన్యాయం అని అభిప్రాయపడుతున్నారు. రైతులు నాలుగు నెలలు కష్టపడి పండించే ఉల్లిపాయకు 30 పైసలు, టమాటాకు ఒక రూపాయి ధర కూడా రాకపోతే, కేవలం మూడు గంటల సినిమాకి వెయ్యి రూపాయలు ఎలా న్యాయం అవుతుందని ప్రశ్నిస్తున్నారు. “వహ్ పవనన్నా వహ్” అంటూ సెటైరికల్ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వివాదం నేపథ్యంలో ‘ఓజీ’ విడుదల కేవలం సినిమా అభిమానులకే కాదు, రాజకీయ వర్గాలకు కూడా ఒక పరీక్షగా మారింది.

Exit mobile version