సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం త్వరగతిన కలిగేలా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇందులో భాగంగా గురువారం అర్థరాత్రి ఆయన ఆలయానికి చేరుకున్నారు. కొండ కింది భాగం నుంచి క్యూ లైన్ లో ఉన్న భక్తుల సమస్యలను తెలుసుకుంటూ, పరిష్కారం కోసం అక్కడే ఉన్న అధికారులను సమాయత్తం చేస్తూ కొండపైకి చేరారు. అనంతరం ఆయన అడ్డదారిలో దర్శనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న కొంతమందిని నియంత్రించారు. అంతటితో ఆగకుండా అటువంటి అవకాశాలు ఉన్న మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గాలకు సిబ్బందితో తాళాలు వేయించారు. ఆ తాళాలు మొత్తం తన గుప్పిట్లో పెట్టుకున్నారు. ప్రొటోకాల్ ఉన్న వీవీఐపీలకు వీఐపీలకు క్యూలైన్ ద్వారా మాత్రమే దర్శనం చేసుకునేలా అక్కడ ఉన్న సిబ్బందిని కఠినంగా ఆదేశించారు. దర్శనాల విషయంలో స్వార్థంతో ఎవరైనా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
We’re now on WhatsApp. Click to Join.
దేవాలయం లోపల భాగంలో కూడా అన్ని ద్వారాలు దగ్గరుండి మూసేయించారు. అర్ధరాత్రి రెండు గంటలకు దర్శనాలు ప్రారంభం కాగానే ఆయన క్యూలైన్లు పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించి భక్తుల రద్దీని క్రమ పద్ధతిలో నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వివిధ రూపాలలో సేవలు అందిస్తున్న స్వచ్ఛంద కార్యకర్తల ప్రతినిధులతో మాట్లాడి భక్తుల ఇబ్బందులను తక్షణమే ఉన్నత అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. సామాన్య భక్తులకు సులభతరమైన దర్శన భాగ్యం కల్పించేందుకు ఆయన నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగినా తక్షణమే స్పందించేందుకు వినాయకుడి గుడి సమీపం నుంచి కొండపై వరకు నిర్ణయాధికారం కలిగిన సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లతో సహా పోలీసు, రెవెన్యూ, అధికారులను సమన్వయం చేస్తూ వారికి సూచనలు అందించారు. తెల్లవారుజామున అమ్మవారి ప్రధాన ఆలయం వద్ద ఈవో రామ రావు తో కలసి కలెక్టర్ ఎస్. డిల్లీరావు దీపారాధన చేసి సరస్వతి దేవికి పూజలు చేశారు. జిల్లాలో ప్రతి ఒక్కరు విద్యా బుద్దులు జ్ఞానం, విజ్ఞానాన్ని ప్రసాదించే లా అనుగ్రహించాలని జగన్మాతను వేడుకున్నట్లు కలెక్టర్ డిల్లీ రావు తెలిపారు.