అమరావతి SRM యూనివర్సిటీకి కార్మిక శాఖ నోటీసులు జారీ చేసింది. నాలుగేళ్లుగా రూ.5.13 కోట్ల లేబర్ సెస్ బకాయిలున్నాయని ఫిర్యాదులు అందాయి. ఇదిలా ఉండగా, ఇటీవల హాస్టల్‌లో 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో కలకలం రేగింది. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఈ ఘటన జరిగిందని విచారణ కమిటీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే కార్మిక శాఖ చర్యలు తీసుకోవడం చర్చనీయాంశమైంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని SRM యూనివర్సిటీకి కార్మిక శాఖ నోటీసులు ఇచ్చింది. నాలుగేళ్లుగా రూ.5.13 కోట్ల లేబర్ సెస్ పెండింగ్ ఉన్నాయి.. అయితే SRM యూనివర్శిటీ లేబర్ సెస్ చెల్లించడం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో ఈ నెల 24న విచారణకు రావాలంటూ SRM వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌కు కార్మిక శాఖ నోటీసులు జారీ చేసింది. యూనివర్సిటీలో పనిచేస్తున్న కార్మికులకు పీఎఫ్ కూడా చెల్లించడం లేదని ఆరోపణలు ఉన్నాయట. కార్మికశాఖ SRM యూనివర్శిటీకి నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
అమరావతిలోని ఏపీ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ హాస్టల్‌లో 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో కలకలం రేగింది. ఆ వెంటనే విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు.ఈ ఘటనతో విద్యార్థులు ఆరోగ్యంపై ఆందోళన చెందిన తల్లిదండ్రులు కూడా యూనివర్సిటీకి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. వెంటనే గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాకు పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆందోళనలకు అసలు కారణాలను తెలుసుకోవడానికి, ప్రభుత్వం ఒక అత్యవసర కమిటీని ఏర్పాటు చేసింది. తెనాలి సబ్ కలెక్టర్ అంజనా సిన్హా ఆధ్వర్యంలో ఆరుగురు అధికారులతో ఈ కమిటీని నియమించారు.
ఏపీ ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ కారణంగా సుమారు 300 మందికి పైగా విద్యార్థులు డయేరియాతో బాధపడుతున్నారని గుర్తించింది. ఈ నేపథ్యంలో, కమిటీ పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించి, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విద్యార్థుల నుంచి వివరాలు సేకరించింది. ఫుడ్, వాటర్ శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. నీటి శుద్ధి ప్రక్రియపై ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతోనూ విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో యూనివర్సిటీ అధికారులు ఈ నెల 7 నుంచి 23 వరకు సెలవులు ప్రకటించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, యూనివర్సిటీ మొత్తం శానిటేషన్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. హాస్టల్, మెస్, తరగతి గదుల్లో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. ఈ పరిణామాల తర్వాత వర్శిటీకి కార్మికశాఖ నుంచి నోటీసులు వచ్చాయి.. ఈ అంశంపై వర్శిటీ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
