Site icon HashtagU Telugu

Ali: రాజ్యసభ ఆటలో ‘అలీ’

Ali

Ali

ప్రముఖ తెలుగు హాస్యనటుడు, టెలివిజన్ హోస్ట్ అలీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి రాజ్యసభ సీటు దక్కుతుందని భావించాడు. తుది జాబితాలో పేరు లేకపోవడంతో నిరాశకు గురి చేసినట్టయింది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన నేపథ్యంలో అలీ మరోసారి చర్చనీయాంశమయ్యాడు. మైనార్టీ కోటా కింద అలీకి రాజ్య సభ సీటు కచ్చితంగా దక్కుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పొలిటికల్ ఈక్వెషన్స్ వల్ల రాజ్యసభ రేసులో అలీ వెనుకబడినట్టు తెలుస్తోంది.

కామెడీ యాక్టర్ అలీ 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీలో చేరారు. రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆయనను బరిలోకి దింపుతారని చర్చ జరిగింది. కానీ, రాజకీయ, కుల సమీకరణాల కారణంగా జగన్ ఆయనకు స్థానం కల్పించలేకపోయారు. ఇటీవల నామినేటెడ్ పోస్టుల భర్తీ సందర్భంగా కూడా జగన్ ఆయనకు ఏదో ఒక పదవి ఇస్తారనే టాక్ వచ్చింది. వాస్తవానికి, రెండు నెలల క్రితం టాలీవుడ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశానికి అలీని ప్రత్యేకంగా పిలిచారు, ఆపై, అతనికి ఏదో ఒక పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్లు సమాచారం. కానీ అది జరగలేదు. రాజ్య సభ సీటు కోసం ఎంతో ఆశగా ఎదురుచూసిన అలీకి నిరాశే ఎదురైందని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో రాజ్యసభ సీటుపై అలీ స్పందించారు. రాజ్యసభ సీటును తాను ఆశించలేదని చెప్పారు. జగన్ దృష్టిలో తాను ఉన్నానని… తనకు ఏ బాధ్యత అప్పజెప్పినా బాధ్యతగా నిర్వర్తిస్తానని అన్నారు. నీకు ఫలానా పదవి ఇస్తానని జగన్ ఏనాడూ గట్టిగా చెప్పలేదని… అయితే ఏదో ఒక పదవి ఇస్తానని మాత్రం చెప్పారని… తనకు కూడా ఆ నమ్మకం ఉందని చెప్పారు.