CM Chandrababu : ‘ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్సఫర్మేషన్’ అంశంపై గురువారం సచివాలయంలో ఉన్నతాధికారులతో జరిగిన వర్క్‌షాప్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఏఐ, ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత, పాలనలో వాటి వినియోగంపైనా ఉన్నతాధికారులకు మార్గనిర్దేశం చేశారు. 30 ఏళ్లనాడు చేసిన ప్రయత్నంతో నేడు ఏపీ టెక్నాలజీలో కీలకంగా ముందుందని ప్రస్తావించారు. మన ప్రభుత్వ వ్యవస్థల్లో మేథాసంపత్తి ఉన్నవారు ఉన్నప్పటికీ ఇంకా పాత విధానాలు అనుసరిస్తున్నారని, పాలనలో తీరు మారాలన్నారు.
Read Also: Pawan Kalyan : చిన్న కోరికను కూడా తీర్చుకోలేకపోతున్న డిప్యూటీ సీఎం పవన్
టెక్నాలజీ అనేది ప్రజల కోసం ఉపయోగపడాలని, రాష్ట్రంలో భారీ డేటా లేక్‌ను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి అన్నారు. ఈ వర్క్‌షాప్ దేశానికి ఒక నమూనాగా నిలుస్తుందని, డిజిటల్, డైనమిక్, ప్రజల కోసం పని చేసే పాలనకు ఇది ఆరంభమని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతుల్లో అధికంగా 75 శాతం భూసంబంధితమైనవే ఉన్నాయని, ఈ సమస్య పరిష్కారానికి త్వరితగతిన భూ రికార్డుల డిజిటలైజేషన్ చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఒకప్పుడు ఇస్రో ఉపగ్రహ ప్రయోగాలను ఆశ్చర్యంగా చూశామని, ఇప్పుడు మన స్టార్టప్‌లు రూ.30 కోట్లతో ఉపగ్రహాలను తయారు చేస్తున్నాయని, దీంతో ప్రపంచం మనవైపు గర్వంగా చూస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఇక, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పౌర సేవల్లో టెక్నాలజీ వాడకం, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు, ఫలితాలను పరిశీలించారు. గుడ్ గవర్నెన్స్ కోసం ఏఐ సహా నూతన టెక్నాలజీ వినియోగం, పౌర సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించడంపై చర్చించారు. భూ రికార్డుల డిజిటలైజేషన్ వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఈ వర్క్‌షాప్ రెండు రోజుల పాటు జరగనుంది. ఈ వర్క్‌షాప్‌నకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, వివిధ శాఖల అధికారులు, కేంద్ర ఐటీశాఖ మాజీ సెక్రెటరీ చంద్రశేఖర్ సహా పలువురు నిపుణులు హాజరయ్యారు.