New Scheme : ఏపీలో పీ-4 పేరుతో కొత్త పథకాన్ని ఉగాది నుంచి ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ మేరకు 16 జిల్లాల్లో నిన్నటి నుంచి సర్వే మొదలైంది. ఈ నెల 18 వరకు సర్వే పూర్తి చేయాలి. 21 నుంచి 23 వరకు గ్రామాల వారీగా సభలు నిర్వహించి వివరాలు వెల్లడిస్తారు. ఆ తర్వాత ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తారు. ఉగాది రోజు పీ-4 కార్యక్రమ వివరాలను ప్రకటిస్తారు. ఇక, మొత్తం పేదల్లో అట్టడుగున ఉండే 20 శాతం పేదలను గుర్తించేందుకు ప్రభుత్వం సర్వే చేస్తోంది. 27 ప్రశ్నలు అడిగి వివరాలు సేకరిస్తోంది. ఇంటి యజమాని ఆధార్, ఫోన్ నంబర్, టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ఏసీ, ల్యాప్‌టాప్, కంప్యూటర్ ఉందా? కరెంట్ బిల్లు ఎంత కడుతున్నారు? వంటి ప్రశ్నలు అడుగుతున్నారు.
Read Also: Kulbhushan Jadhav: కులభూషణ్‌ను పాక్‌కు పట్టించిన ముఫ్తీ షా మిర్ హతం.. ఎవరు ?
ముందుగా నాలుగు గ్రామాల్లో పీ-4 విధానం పైలట్ ప్రాజెక్టును అమలు చేసి 5,869 కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ పీ – 4 కార్యక్రమానికి 2 ఎకరాల మాగాణి / ఐదు ఎకరాల మెట్ట భూమి, ప్రభుత్వ ఉద్యోగులు, టాక్స్ పేయర్స్, ఫోర్ వీలర్స్ ఉన్న వారు, 200 యూనిట్ల కన్నా ఎక్కువ విద్యుత్ వాడే వారు అర్హులు కారు. ఉగాది నుంచి పీ-4 విధానం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. అట్టడుగున ఉన్న పేదల సాధికారత, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు దీనిని చేపడుతున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు అదనంగా పీ-4లో ఉన్న వారికి చేయూత ఇస్తామని చెప్పారు.
పీ4 విధానాన్ని.. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్‌నర్‌షిప్ (PPPP)గా పిలుస్తారు. ఈ పథకానికి సరైన రూపాన్ని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభిప్రాయ సేకరణ సర్వే నిర్వహిస్తోంది. ఫిబ్రవరిలో ప్రారంభమైన తొలి విడత సర్వే పూర్తయింది. మార్చి 8 నుంచి రెండో విడత మొదలైంది. గ్రామ, వార్డు సచివాలయ అధికారులు ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆర్థిక పరిస్థితి, వారికి ఎంత వరకు ఆసక్తి ఉందో తెలుసుకుంటున్నారు.ఈ వివరాలు అన్నీ సచివాలయ ఉద్యోగులు ఒక యాప్‌లో పొందుపరుస్తారు. ఉగాది రోజున ప్రభుత్వం అధికారికంగా పీ4 విధానాన్ని ప్రారంభించనుంది. ఇందులో భాగంగా.. ప్రజలు పెట్టుబడి పెట్టడానికి వీలుగా ఒక ప్రత్యేక వెబ్‌సైట్, మొబైల్ యాప్ అందుబాటులోకి రానున్నాయి. ఇది విజయవంతమైతే.. దేశవ్యాప్తంగా ఇదే విధానాన్ని అనుసరించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also: Mlc : కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి, సామా, అద్దంకి ?