Nadendla Manohar : రాష్ట్రంలో కొత్తగా రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. దరఖాస్తు స్వీకరించిన 21 రోజుల్లోగా సమస్యను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కొత్త రేషన్‌కార్డుకు మ్యారేజ్ సర్టిఫికెట్ తప్పనిసరి అన్న ప్రచారంపై మంత్రి స్పందించారు. పెళ్లి కార్డు, ఫొటోలు, మ్యారేజ్ సర్టిఫికెట్‌లు ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరం లేదని తేల్చిచెప్పారు. ఈ విషయంలో క్షేత్రస్థాయి సిబ్బంది ఎలాంటి అపార్థాలకు గురికాకుండా నిర్దిష్టంగా పనిచేయాలని సూచించారు. ఏ వ్యక్తి అయినా రేషన్‌కార్డుకు దరఖాస్తు చేస్తే ఆ దరఖాస్తును తప్పక స్వీకరించాలని పేర్కొన్నారు. సందేహాలు ఉన్న సందర్భంలో మాత్రం క్షేత్రస్థాయిలో సరిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలన్నారు.
Read Also: ED Raids : అన్ని హద్దులు దాటుతున్నారు.. ఈడీ సోదాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
రాష్ట్రంలోని 4.24 కోట్ల మందికి జూన్‌లో ఉచితంగా కొత్త రేషన్‌కార్డులు అందించనున్నట్టు మంత్రి తెలిపారు. అవసరమైన మొత్తం సమాచారం ప్రభుత్వానికి ఇప్పటికే ఉందని, అందులో ఎలాంటి లోపం లేదన్నారు. ప్రజలకు సులభంగా సేవలు అందించేందుకు ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ ముందుకు సాగుతోందని చెప్పారు. ఇక, పై జారీ చేసే కార్డులు స్మార్ట్ కార్డులుగా ఉంటాయని, వీటిలో క్యూఆర్ కోడ్ ఉంటుందని వివరించారు. వివిధ శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని పేర్కొన్నారు. వయస్సుతో సంబంధం లేకుండా కుటుంబ సభ్యులను రేషన్‌కార్డులో చేర్చుకునే అవకాశం కల్పించామని తెలిపారు. ఇక మృతి చెందిన వారి పేర్లను మాత్రమే తొలగింపుకు పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. రేషన్‌కార్డు సమాచారంలో మార్పుల కోసం ప్రజలు జాయింట్ కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, తహసీల్దార్ స్థాయిలోనే సమస్యలు పరిష్కరించుకునే వీలుగా అవకాశం కల్పించామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.