Site icon HashtagU Telugu

Nara Lokesh: పరదాల పాలన నుంచి ప్ర‌జ‌ల‌కు విముక్తి.. మంత్రి నారా లోకేష్ ఆస‌క్తిక‌ర ట్వీట్‌..!

Nara Lokesh

Nara Lokesh

Nara Lokesh: ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన కూట‌మి ప్ర‌భుత్వం జెట్ స్పీడ్‌లో ప‌నులు చేస్తోంది. ఇప్ప‌టికే ప‌లు ర‌కాల ప‌థ‌కాల‌కు పేర్లు మార్పు, పెరిగిన పెన్ష‌న్లు పంపిణీ, త్వ‌ర‌లోనే అన్నా క్యాంటీన్లు- మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప‌థ‌కం వంటి హామీల‌పై స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తూ ప్రారంభ తేదీల‌ను ప్ర‌క‌టిస్తున్నారు. ఇవే కాకుండా మంత్రులు తాము గెలిచిన నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌త్యేకంగా అడిగి తెలుసుకుంటున్నారు. ఇందుకోసం ప్ర‌జా ద‌ర్బార్ అనే కార్య‌క్ర‌మం చేప‌డుతున్నారు. అయితే మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను వింటూ వారి స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార మార్గాల‌ను వెతుకుతున్నారు. తాజాగా నిర్వ‌హించిన ప్ర‌జాద‌ర్బార్ అనంతరం నారా లోకేష్ గ‌త వైసీపీ ప్ర‌భుత్వంపై ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు.

Also Read: Naveen Polishetty: ఇంకొన్ని నెలలు సినిమాలకు దూరం కానున్న న‌వీన్ పొలిశెట్టి.. కార‌ణ‌మిదే..?

ఆ ట్వీట్‌లో ఏం రాశారంటే.. “పరదాల పాలనలో ప్రజలు పడిన ఇబ్బందులు అన్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. గత ప్రభుత్వంలో తాము ఎదుర్కొన్న సమస్యలు, పడుతున్న బాధలకు పరిష్కారం లభించక ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. సమస్యలు విన్నవించుకునేందుకు వచ్చిన వారికి తాడేపల్లి ప్యాలస్ తలుపులు తెరుచుకోకపోవడంతో దిగాలుగా వెనుదిరిగారు. ప్రజా ప్రభుత్వం కొలువుదీరడంతో తమ సమస్యలకు, కష్టాలకు పరిష్కారం లభిస్తుందనే విశ్వాసంతో మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు “ప్రజాదర్బార్” కు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఉండవల్లిలోని నివాసంలో 17వ రోజు “ప్రజాదర్బార్”కు విన్నపాలు వెల్లువెత్తాయి. ప్రతి ఒక్కరి సమస్యను విని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చాను. గత ప్రభుత్వంలో పరిష్కారం కాని సమస్యలకు “ప్రజాదర్బార్” ద్వారా భరోసా లభిస్తుండటంతో ప్రజలు ఆనందంగా తిరిగి వెళ్తున్నారు” అని రాసుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

అంత‌కుముందు రోజు అంటే మంగ‌ళ‌వారం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలను సచివాలయంలోని నా ఛాంబర్ లో కలిశారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను మంత్రికి విన్నవించారు. ప్రతి ఒక్కరి వద్ద విజ్ఞాపన పత్రాలు స్వీకరించి, ఆయా సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తానని భరోసా ఇచ్చారు. ఆయా సమస్యలను విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు కూడా జారీచేశారు మంత్రి లోకేష్‌.