ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) రాష్ట్రానికి పెట్టుబడులు, ఐటీ రంగంలో కొత్త అవకాశాలను తీసుకురావడానికి కృషి చేస్తోంది. ఈ దిశగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ (Lokesh) లండన్ పర్యటనలో ఉన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. గత 15 నెలల్లోనే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. క్వాంటమ్ వ్యాలీ, డేటా సిటీలు రాష్ట్ర రూపురేఖలను మార్చే ప్రాజెక్టులుగా నిలుస్తాయని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు అడ్డుగా ఉన్న నిబంధనలను సవరించి పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నామని లోకేష్ స్పష్టం చేశారు.
ఇక లండన్ పర్యటనలో ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న మంత్రి నారా లోకేష్ ట్విట్టర్‌లో ఆసక్తికర స్పందన ఇచ్చారు. బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీ ‘బ్లాక్ బక్’ సీఈవో రాజేష్(Black Buck CEO Rajesh) తన ప్రాంతంలోని రోడ్ల దయనీయ పరిస్థితులను ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. తన కంపెనీ ఉద్యోగులు ఆఫీసుకి వెళ్లేందుకు గంటన్నర సమయం పట్టుతోందని, రోడ్లు గుంతలతో నిండిపోయి దుమ్ము కారణంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వాపోయారు. గత ఐదేళ్లలో ఎలాంటి మార్పు జరగలేదని చెప్పిన రాజేష్, తమ కంపెనీని అక్కడి నుంచి వేరే చోటుకు తరలించే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు.
Jr NTR Injury : జూ.ఎన్టీఆర్ ఎలా గాయపడ్డారో తెలుసా?
ఈ ట్వీట్‌కు వెంటనే స్పందించిన నారా లోకేష్, “హాయ్ రాజేష్.. మీకు ఆసక్తి ఉంటే విశాఖపట్నానికి రీ-లోకేట్ అవ్వండి” అంటూ ఆహ్వానించారు. విశాఖపట్నం దేశంలో ఐదు పరిశుభ్రమైన నగరాల్లో ఒకటని, మహిళలకు రక్షిత నగరమని, అత్యాధునిక భవనాలు, సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. రాజేష్ తనతో నేరుగా సంప్రదించాలని సూచిస్తూ విశాఖపట్నానికి స్వాగతం పలికారు. అయితే ఈ ట్వీట్‌పై బ్లాక్ బక్ కంపెనీ మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే క్రమంలో ఇటీవల వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్‌కు కూడా లోకేష్ స్పందించి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. దీంతో ఏపీ పెట్టుబడుల గమ్యస్థానంగా మారుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

