అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసు (Amaravati Inner Ring Road Case)లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) పేరును సీఐడీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో లోకేష్ ను A14 గా చేరుస్తూ హైకోర్టు లో ఏపీ సీఐడీ (CID) మంగళవారం మెమో దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబు (Chandrababu), మాజీ మంత్రి నారాయణ (Narayana)పై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్‌ను దక్షిణం వైపున మార్చి లబ్ధి పొందారని సీఐడీ ఆరోపిస్తోంది. హెరిటేజ్ ఆస్తులు పెంచుకోవడం కోసం ఈ అలైన్‌మెంట్ మార్చారని ఆరోపించింది. ఈ నేపథ్యంలో సీఐడీ అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని లోకేష్ హైకోర్టును ఆశ్రయించారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో తనపేరు నమోదు చేయడం ఫై ఇప్పటికే లోకేష్ స్పందించడం జరిగింది. నా యువగళం పాదయాత్ర ఆరంభం కాకూడదని జీవో 1 తెచ్చినా, ఆగని యువగళం జనగళమై గర్జించింది. ఎక్కడికక్కడ అడ్డుకున్నా జనజైత్రయాత్రగా ముందుకు సాగింది. మళ్లీ యువగళం ఆరంభిస్తామనే సరికి, నా శాఖకి సంబంధంలేని, అసలు వేయని రింగ్ రోడ్డు కేసులో నన్ను ఏ14గా చేర్చారు 420 సీఎం. రిపేర్ల పేరుతో రాజమహేంద్రవరం బ్రిడ్జి మూసేయించారని మండిపడ్డారు. నువ్వెన్ని తప్పుడు కేసులు పెట్టి, అక్రమ అరెస్టులు చేసినా నా యువగళం ఆగదు. ఎన్ని అడ్డంకులు కల్పించినా జనచైతన్యమే యువగళాన్ని వినిపిస్తుంది. ఇచ్ఛాపురం వరకూ నడిపిస్తుందన్నారు.
శుక్రవారం రాత్రి నుంచి ఆయన పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తారని టీడీపీ నేతలు తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో సెప్టెంబర్ 9 నుంచి పాదయాత్ర ఆగిపోయింది. ఓవైపు పార్టీ అధినేత చంద్రబాబు జైల్లో ఉండటం, మరోవైపు లోకేష్ ఢిల్లీలో ఉండటంతో పార్టీలో ఏం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా ఢిల్లీలోనే ఉండిపోయిన లోకేష్ మళ్లీ పాదయాత్ర ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడలో లోకేష్ యువగళాన్ని ప్రారంభించనున్నారు.
Read Also: Group 1 Exam : గ్రూప్ 1 పరీక్ష మళ్లీ పెట్టాల్సిందే.. హైకోర్టు డివిజన్ బెంచ్ సంచలన తీర్పు