Site icon HashtagU Telugu

AP Faction Fight: ‘నగరి’ వైసీపీలో వర్గపోరు.. జగన్ కు రోజా కంప్లైంట్

Roja And Jagan

Roja And Jagan

నగరి నియోజకవర్గంలో అధికార వైఎస్సార్‌సీపీ వర్గపోరు తారాస్థాయికి చేరడంతో పర్యాటక శాఖ మంత్రి రోజా సీఎం జగన్ కు ఫిర్యాదు చేశారు. ప్రత్యర్థి వర్గంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె, తనను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రోజా నగరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే రోజా కేబినెట్ లో హోదా దక్కించుకన్న తర్వాత ఎన్నికల అనంతరం శ్రీశైలం దేవస్థానం చరిమన్‌రెడ్డివారి చక్రపాణిరెడ్డి, వడమాలపేట జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్‌రెడ్డి, రాష్ట్ర ఈడిగ కార్పొరేటన్‌ చైర్‌పర్సన్‌ కేజే శాంతి, నగరి మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ కేజేకుమార్‌, పుత్తూరుకు చెందిన ఏలుమలై, విజయపురం లక్ష్మీపతి రాజులను రోజా దూరంగా ఉంచుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

వీరంతా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులుగా ముద్ర పడ్డారు. అప్పటి నుంచి నగరి వైఎస్సార్‌సీపీలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. పెద్దిరెడ్డి మద్దతుతో కొందరు నేతలు పదవులు లాక్కోవడం, రోజా ప్రత్యర్థి వర్గం ఫ్లెక్సీలు చింపివేయడం ఇప్పటికే జరుగుతున్న ఘర్షణకు మరింత ఆజ్యం పోసింది. కాగా, ఇటీవల కొప్పెడులో మంత్రి రోజా ప్రత్యర్థి వర్గం ఆమె జోక్యం లేకుండానే ఆర్‌బీకే, వెల్‌నెస్‌ సెంటర్లకు భూమిపూజ చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రోజా.. పార్టీ నేతలకు ఆడియోను విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ ఆడియోలో రోజా మాట్లాడుతూ.. పార్టీకి నష్టం కలిగించే కార్యక్రమాలు చేస్తూ నా నియోజకవర్గంలో పార్టీని నిర్వీర్యం చేయడం ఎంత వరకు కరెక్ట్? పార్టీ కోసం కష్టపడుతున్న నన్ను మానసికంగా హింసిస్తున్నారు. నాయకులు వారికి మద్దతు పలకడం దారుణం. అలాంటి వ్యక్తులు పార్టీలో కొనసాగితే నేను పని చేయలేను అని తేల్చి చెప్పింది. దీంతో నగరి గొడవలు రసవత్తరంగా మారాయి. రోజా ఫిర్యాదుపై జగన్ స్పందన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.