Tirumala laddu controversy : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందనే అంశం కలకలం రేపింది. ఈ అంశంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జనసేన నేత, సినీ నటుడు నాగబాబు స్పందిస్తూ… ద్రోహులను క్షమించకూడదని చెప్పారు. ఎక్స్ వేదికగా నాగబాబు స్పందిస్తూ.. ‘ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ‘తిరుమల తిరుపతి దేవస్థానం’ ప్రసాదాన్ని జంతు కొవ్వుతో, చేప నూనేతో కల్తీ చేసి కోట్లమంది హిందువుల మనోభావాలతో ఆడుకోవడం క్షమించరాని నేరం. పాపం చేసి కోట్లు కూడగట్టుకున్నాం అనుకున్నారు కానీ… కోట్ల మంది హిందువుల గోడు కూడగట్టుకున్నారు అని గుర్తించలేకపోయారని మండిపడ్డారు.
Read Also: Onion Juice: జుట్టు సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఉల్లిపాయతో ఇలా చేయండి..!
ఒక వ్యక్తి ఒక మతాన్ని స్వీకరించి ఆ దేవున్ని నిష్టతో పూజించి ఆ దేవుడికి ప్రసాదం అర్పించడం జరుగుతుంది తదుపరి ఆ ప్రసాదాన్ని భుజిస్తే ఆ దేవుడే వారితో మమేకమైనట్టు నమ్ముతారు, అంతటి విశిష్టతమైన ప్రసాదాన్ని అందులోను తిరుమల వంటి ప్రపంచ ప్రఖ్యాత గల పుణ్యక్షేత్రంలోని లడ్డు ప్రసాదాన్ని నాలుగు రాళ్లు మిగుల్చుకోవాలనే దురుద్దేశంతో జంతు కొవ్వు సైతం వెయ్యడానికి వెనకాడని ఇలాంటి ద్రోహుల్ని క్షమించకూడదు, అందుకే టీటీడీ లాంటి శాఖలలో హిందుత్వాన్ని ఆచరించే వారుంటేనే ఇలాంటి అవాంఛనీయమైన సంఘటనలు పునరావృతం అవ్వవని నమ్ముతూ ఈ హేయమైన చర్యని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను..’’ అని మెగా బ్రదర్ నాగబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ప్రస్తుతం తిరుమల లడ్డూ వ్యవహారం దేశ రాజకీయాల్లో సైతం హాట్ టాపిక్‌గా మారింది. తిరుమల స్వామి లడ్డూ ప్రసాదం కలుషితం అయినట్టు నిర్ధారణ కావడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కోట్లాది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ అంశంపై తీవ్రంగానే స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా శుక్రవారం ఫోన్ చేసి.. ఈ వ్యవహారంపై పూర్తి నివేదికను తనకు పంపాలని కోరారు. భారత ప్రభుత్వ ఆహార భద్రతా ప్రమాణాల అథారిటీ నిబంధనలకు అనుగుణంగా కూడా చర్యలు తీసుకుంటామని నడ్డా చెప్పడంతో.. ఏపీ ప్రభుత్వం పూర్తి నివేదికను నడ్డాకు పంపేందుకు సమాయత్తమవుతోంది.