Mysore Rajamata : ప్రమోదా దేవి.. మైసూరు రాజమాత. మైసూరు రాజ కుటుంబానికి భక్తిభావం ఎక్కువ. వీరు తిరుమల శ్రీవారిని ఆరాధిస్తుంటారు. దాదాపు 300 ఏళ్ల క్రితం అప్పటి మైసూరు మహారాజు తిరుమల శ్రీవారికి వెండి అఖండ దీపాలను విరాళంగా ఇచ్చారు. తాజాగా ఇప్పుడు మైసూరు రాజమాత ప్రమోదా దేవి కూడా రెండు భారీ వెండి అఖండ దీపాలను మైసూర్ సంస్థానం తరపున తిరుమల శ్రీవారికి అందజేశారు. రంగనాయకుల మండపంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్‌లకు వాటిని ఆమె అందించారు. ఒక్కో వెండి అఖండ దీపం దాదాపు 50 కిలోల బరువు ఉంటుంది. వీటిని శ్రీవారి గర్భగుడిలో వెలిగిస్తుంటారు. అంతకుముందు మైసూర్ మహారాజు యదువీర్ క్రిష్ణదత్త చామరాజ్ వడియార్, రాజమాత ప్రమోదాదేవి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాజమాతకు శ్రీవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను బీఆర్ నాయుడు అందించారు.
Also Read :Congress Vs Shashi Tharoor: శశిథరూర్‌పై వేటుకు కాంగ్రెస్ రెడీ అవుతోందా ?
మైసూరు రాజమాత ప్రమోదా దేవి గురించి..
- వడియార్(Mysore Rajamata) రాజవంశం కర్ణాటకలోని మైసూరు ప్రాంతాన్ని వందల ఏళ్ల పాటు పాలించింది.
- ఇప్పటికీ ఈ రాజవంశం కంటిన్యూ అవుతోంది.
- ప్రస్తుతం ఈ రాజవంశానికి వారసుడిగా యదువీర్ క్రిష్ణదత్త చామరాజ్ వడియార్ వ్యవహరిస్తున్నారు.
- ఏటా మైసూరు దసరా ఉత్సవాలు ఈయన ఆధ్వర్యంలోనే జరుగుతాయి.
- వడియార్ రాజవంశం నిర్మించిన మైసూర్ ప్యాలెస్ ఇప్పుడు గొప్ప టూరిస్ట్ ప్లేస్‌గా మారింది.
- ఇప్పుడు మైసూరు రాజవంశ రాజమాతగా ప్రమోదా దేవి వడియార్ ఉన్నారు.
- దివంగత మైసూర్ రాజ కుటుంబ వారసుడు శ్రీకాంత దత్త నరసింహరాజా వడియార్ సతీమణే ప్రమోదా దేవి.
- 2013 డిసెంబరు 10న శ్రీకాంత దత్త నరసింహరాజా వడియార్ చనిపోయారు.
- మైసూరు చివరి పాలకుడు జయచామరాజేంద్ర ఏకైక కుమారుడే ఈ శ్రీకాంత దత్త నరసింహరాజా వడియార్.
- శ్రీకాంత దత్త నరసింహరాజా వడియార్ సమీప బంధువే ప్రమోదా దేవి. దీంతో వీరిద్దరి పెళ్లి జరిగింది. అయితే ఈ దంపతులకు సంతానం లేదు. ఈనేపథ్యంలో తమ వంశం నుంచే ఎవరినైనా ఒకరిని దత్తత తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- దీంతో యదువీర్ క్రిష్ణదత్త చామరాజ్ వడియార్‌ను ప్రమోదా దేవి దత్తత తీసుకున్నారు.
- స్వరూప్ ఆనంద్ గోపాల్ రాజ్ ఉర్స్, త్రిపుర సుందరీ దేవి దంపతుల కుమారుడే యదువీర్ క్రిష్ణదత్త చామరాజ్ వడియార్.
- ఈ విధంగా మైసూర్ మహారాజుగా యదువీర్ క్రిష్ణదత్త చామరాజ్ వడియార్ అవకాశాన్ని పొందారు.