Tourism Conclave Program : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విజయవాడలో జరిగిన టూరిజం కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ..ఈ విజయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా అభినందించారని చెప్పారు. యోగా అనేది భారతీయ సంస్కృతికి ప్రతీక. ఇది దేశాన్ని గర్వపడేలా చేసే కార్యక్రమం. మన ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన యోగా కార్యక్రమం గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఇది మన రాష్ట్రానికి గర్వకారణం అని ఆయన పేర్కొన్నారు.
Read Also: Teamindia Captain: గిల్‌కు బిగ్ షాక్.. టీమిండియా వన్డే కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్?
ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బాబా రామ్‌దేవ్ పాల్గొనడం గర్వకారణమన్నారు. బాబా రామ్‌దేవ్ సమాజానికి చేసిన సేవ అపూర్వం. ఆయన్ను రాష్ట్ర పర్యాటక శాఖ సలహాదారుగా నియమించాలని కోరాం అని తెలిపారు. పర్యాటక రంగం రాష్ట్రాభివృద్ధికి కీలకమని సీఎం స్పష్టం చేశారు. భవిష్యత్తు పర్యాటక రంగానిదే. టెంపుల్ టూరిజంతో పాటు, నదీ తీర ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, పర్వత శ్రేణులు ఇవన్నీ మనకు అభివృద్ధి అవకాశాలను ఇస్తున్నాయి. పాపికొండలు, కోనసీమ, హార్సిలీ హిల్స్ వంటి ప్రాంతాలను ప్రపంచ పటంలో నిలబెట్టేలా పనిచేస్తున్నాం అని చెప్పారు.
మదనపల్లెను దేశంలోనే ప్రఖ్యాతి చెందిన వెల్‌నెస్ సెంటర్‌గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. యోగా, ధ్యానం (మెడిటేషన్) వంటివి మన జీవన శైలిలో గేమ్‌చేంజర్ అవుతాయి. ఆరోగ్య జీవనం కోసం వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం అని పేర్కొన్నారు. ప్రతి రంగంలో సంపద సృష్టించాలన్నదే నా దృష్టికోణం. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించిన తొలి ప్రభుత్వం మనదే. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని కోరుకుంటున్నా. విదేశాల్లో ఉన్న తెలుగువాళ్లు భారతీయులలో 35 శాతం వున్నారని, వారు ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నారని గర్వంగా చెప్పగలను అని చంద్రబాబు పేర్కొన్నారు.
బిల్ గేట్స్‌తో గతంలో జరిగిన చర్చలు, హైదరాబాద్‌లో ఐటీ కేంద్రాల ఏర్పాటుకు ఆయన చూపిన మార్గదర్శనం గురించి గుర్తు చేసుకున్నారు. భారత ఐటీ విప్లవానికి పీవీ నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలతో బీజం వేశారు. ఆ మార్గాన్ని మనం కొనసాగించాలి అన్నారు. టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయని యువత భయపడుతున్నారు. కానీ స్మార్ట్ వర్క్, నైపుణ్యం పెంచుకోవడమే పరిష్కారం. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ముందడుగు వేయాలి. ప్రజలే మన గొప్ప సంపద. సరైన ప్రణాళికతో పనిచేస్తే పేదలను కూడా అభివృద్ధి దిశగా నడిపించవచ్చు అని పేర్కొన్నారు. అలాగే, ఆగస్టు 15లోగా అన్ని సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తేనున్నట్టు సీఎం తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి ప్రజల సహకారం కీలకం అని, అందరం కలసి పనిచేయాలన్నది ఆయన సందేశం.
Read Also: Prashant Kishor : బీహార్ పాలిటిక్స్.. రాహుల్‌గాంధీకి ప్రశాంత్ కిషోర్ సవాల్