Nara Bhuvaneshwari: తలసేమియా బాధితుల కోసం ఫండ్ రైజింగ్ చేసేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15న విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ‘యుఫోరియా’ మ్యూజికల్ నైట్ షో జరగనుంది. ఈ షోను తాను చేస్తున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కోరగానే ఈ షోలో పాల్గొనేందుకు తాను అంగీకరించానని ఆయన వెల్లడించారు. విజయవాడలో నిర్వహించనున్న మ్యూజికల్ నైట్ షో వివరాలను నారా భువనేశ్వరి, తమన్ మీడియాకు వివరించారు. తలసేమియా బాధితులకు ఎంతో కొంత సాయం అందుతుందంటే తాను తప్పకుండా సంతోషిస్తానని తమన్ చెప్పారు. ఈ షో ద్వారా వచ్చే ప్రతీ రూపాయి తలసేమియా బాధితులకే వెళ్తుందని స్పష్టం చేశారు. నారా భువనేశ్వరి నమ్మకం ఉంచి ఇంత పెద్ద కార్యక్రమాన్ని తనకు అప్పగించారని ఆయన అన్నారు. సీఎం చంద్రబాబు ఏపీ కోసం పగలు, రాత్రి కష్టపడి పని చేస్తున్నారని తమన్ కొనియాడారు.
Also Read :Mahesh Babu: హీరో మహేష్‌బాబు ఓటర్ ఐడీ.. తొలగించిన ఏపీ అధికారులు.. ఎందుకు ?
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరవుతారు : నారా భువనేశ్వరి
తలసేమియా బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యుఫోరియా మ్యూజికల్ నైట్ షో నిర్వహిస్తున్నామని నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతారని చెప్పారు. ‘‘సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని ఎన్టీఆర్ బలంగా నమ్మారు. ఎన్టీఆర్ ఆశయాల స్ఫూర్తితోనే ఎన్టీఆర్ ట్రస్టు ఏర్పాటు జరిగింది’’ అని ఆమె చెప్పారు. ‘‘మ్యూజికల్ నైట్ షో రోజున రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రక్తదానం చాలా మంది జీవితాలను నిలబెడుతుంది. ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి’’ అని నారా భువనేశ్వరి కోరారు.
Also Read :Defection MLAs : సీఎల్పీ భేటీకి ఫిరాయింపు ఎమ్మెల్యేలు దూరం.. ఎందుకు ?
రూ.6 లక్షలతో చంద్రబాబే టికెట్లు బుక్ చేశారు
‘‘విజయవాడలో నిర్వహించే మ్యూజికల్ నైట్ షోకు సీఎం అయినా, ఆయన వెంట వచ్చే పీఏలు, భద్రతా సిబ్బంది అయినా సరే టికెట్ కొంటేనే ఎంట్రీ లభిస్తుంది’’ అని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. తమ కుటుంబ సభ్యుల కోసం రూ.6 లక్షలు వెచ్చించి చంద్రబాబే స్వయంగా మ్యూజికల్ నైట్ టికెట్లు కొని టేబుల్ బుక్ చేశారని ఆమె చెప్పారు. ఎవరి కాళ్లమీద వాళ్లే నిలబడాలని భావించే వ్యక్తి చంద్రబాబు అని నారా భువనేశ్వరి తెలిపారు. అందుకే ఎన్‌టీఆర్ ట్రస్టు కార్యక్రమాల గురించి ఆయన్ను తానేమీ అడగనన్నారు. ఒకవేళ అడిగినా చంద్రబాబు వెంటనే అంగీకరించరన్నారు.