Murders In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీ నేతల హత్యలు (Murders In Telugu States) కలకలం రేపుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడిని హత్య చేయగా.. ఏపీలో తిరుపతిలోని టీడీపీ నాయకుడి దారుణ హత్య హాట్ టాపిక్‌గా మారింది. ఈ హత్యల వెనక రాజకీయ కారణాలే ఉండొచ్చని తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడి హత్య
తెలంగాణలోని జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. గ్రామంలో రాజకీయ కక్షలే హత్య కు ప్రధాన కారణమని చెబుతున్నారు. తమ్ముడి లాంటి వాడిని కోల్పోయానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్యకు బాధ్యులైన వారిని పట్టుకోవాలని జగిత్యాల- ధర్మపురి ప్రధాన రహదారిపై బైఠాయించి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపారు. అంతేకాకుండా జగిత్యాలలో బీఆర్ఎస్ రాజ్యం నడుస్తోందా..? కాంగ్రెస్ రాజ్యం నడుస్తుందా అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోలీసులపై మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ నాయకులకే రక్షణ కరువైందని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే గంగారెడ్డిని హత్య చేసినట్టు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Adani Group New App: అదానీ గ్రూప్ నుంచి అదానీ వన్ సూపర్ యాప్ విడుదల.. తక్కువ ధరకే టిక్కెట్లు!
తిరుపతిలో టీడీపీ నేత దారుణ హత్య
తిరుపతిలో దారుణ హత్య చోటుచేసుకుంది. టీడీపీ నేత మల్లారపు హరిప్రసాద్ దారుణ హత్యకు గురయ్యారు. ఆయన ఇంట్లో నిద్రిస్తుండగా పెట్రోల్ పోసి దుండగులు నిప్పంటించారు. ఘటనా స్థలంలోనే హరిప్రసాద్ మృతిచెందారు. రాజకీయ కక్షలతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇది వైసీపీ నాయకుల పనేనని టీడీపీ ఆరోపిస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.