Kapu Politics : ‘కాపు’ కోట ర‌హ‌స్యం

కొత్త రాజ‌కీయ పార్టీకి బ్లూ ప్రింట్ ను ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం సిద్ధం చేస్తున్నాడు. ఆ మేర‌కు తొలి ప్ర‌య‌త్నంగా బీసీ, ద‌ళిత వ‌ర్గాల‌కు ఆయ‌న లేఖ రాయ‌డం ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం క‌లిగిస్తోంది. ప‌ల్ల‌కీ మోసే బోయ‌లు మాదిరిగా కాకుండా రాజ్యాధికారం దిశ‌గా వెళ‌దామ‌ని ఆ లేఖ సారాంశం.

  • Written By:
  • Publish Date - January 4, 2022 / 01:02 PM IST

కొత్త రాజ‌కీయ పార్టీకి బ్లూ ప్రింట్ ను ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం సిద్ధం చేస్తున్నాడు. ఆ మేర‌కు తొలి ప్ర‌య‌త్నంగా బీసీ, ద‌ళిత వ‌ర్గాల‌కు ఆయ‌న లేఖ రాయ‌డం ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం క‌లిగిస్తోంది. ప‌ల్ల‌కీ మోసే బోయ‌లు మాదిరిగా కాకుండా రాజ్యాధికారం దిశ‌గా వెళ‌దామ‌ని ఆ లేఖ సారాంశం. దానిలోని లోతుపాతుల‌ను, ముద్ర‌గ‌డ మీద ఉన్న విశ్వ‌స‌నీయ‌త‌ను విశ్లేషిస్తే..జ‌న‌సేన ప్రాబ‌ల్యాన్ని ప‌రిమితం చేసేలా అడుగులు ప‌డుతున్నాయా? అనే అనుమానం క‌లుగుతోంది. కొత్త పార్టీ ద్వారా జ‌గ‌న్ కు లాభం చేకూర్చే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయా? అనే అనుమానం రాక‌మాన‌దు.కాపు జాతికి రిజ‌ర్వేష‌న్ ఇవ్వాల‌ని సుదీర్ఘ పోరాటం ముద్ర‌గ‌డ చేశాడు. కిర్లంపూడి స‌మీపంలో ర‌త్నాచ‌ల్ ఎక్స్ ప్రెస్ ను త‌గుల‌బెట్టే వ‌ర‌కు ఆ ఉద్య‌మాన్ని తీసుకెళ్లాడు. ఆనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని ముప్పుతిప్ప‌లు పెట్టాడు. కేంద్రం ప్ర‌క‌టించిన 10శాతం ఈడ‌బ్ల్యూఎస్ రిజ‌ర్వేష‌న్లో 5శాతం కాపుల‌కు ఇస్తాన‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించాడు. దీంతో తొలి నుంచి టీడీపీకి ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలు వైసీపీ వైపు వెళ్లిపోయారు. ఫ‌లితంగా చంద్ర‌బాబుకు 23 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే 2019 ఎన్నిక‌ల్లో మిగిలారు.

Also Read : వైసీపీ కుమ్ములాట‌! 13 జిల్లాల చిత్రం !!

ఏపీ సీఎంగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత కాపు రిజ‌ర్వేష‌న్ల గురించి ముద్ర‌గ‌డ దాదాపుగా మ‌రిచిపోయాడు. రిజ‌ర్వేష‌న్లు కేంద్రం ప‌రిధిలోని అంశమ‌ని ప‌రోక్షంగా కాపు రిజ‌ర్వేష‌న్లు అసాధ్య‌మ‌ని జ‌గ‌న్ తేల్చేశాడు. అయిన‌ప్ప‌టికీ ముంద్ర‌గ‌డ త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌కు వెళ్ల‌లేదు. పైగా బీసీ, ద‌ళిత‌, కాపు సామాజిక వ‌ర్గాల‌కు రాజ్యాధికారం అంటూ కొత్త నినాదం అందుకున్నాడు.ఏపీ సామాజిక వ‌ర్గాలను పార్టీల వారీగా తీసుకుంటే…తొలి నుంచి బీసీలు తెలుగుదేశం పార్టీకి అండ. కాపులు ప్ర‌జారాజ్యం పెట్టే వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ కి పెట్ట‌ని కోట‌గా ఉండే వాళ్ల‌ట‌. ఎస్సీల్లో మాల ఎక్కువ‌గా కాంగ్రెస్ పార్టీకి ఆ త‌రువాత వైసీపీకి ఎక్కువ‌గా మొగ్గుచూపుతార‌ని సామాజిక విశ్లేష‌కుల ప‌రిశీల‌న‌. ఇక మాదిగ‌లు మాత్రం తొలి నుంచి టీడీపీ వైపు ఎక్కువ‌గా ఉండేవార‌ట‌. ప్ర‌స్తుతం మారిన ప‌రిస్థితుల దృష్ట్యా బీసీలు ఎక్కువ‌గా వైసీపీ వైపు మ‌ళ్లార‌ని టాక్. అందుకే, 2019 ఎన్నిక‌ల్లో 50శాతానికి పైగా ఓటు బ్యాంకు ఆ పార్టీకి వ‌చ్చింది.

Also Read :  రాధా ‘రెక్కీ’ పైవాడికే ఎరుక‌!

ఇక రెడ్డి, క‌మ్మ సామాజిక వ‌ర్గాల చేతిలో కొన్ని ద‌శాబ్దాలుగా రాజ్యాధికారం ఉంది. ఆ రెండు సామాజిక వ‌ర్గాల‌కు ప్ర‌త్యామ్నాయంగా అధికారం చేప‌ట్టాల‌ని ముద్ర‌గ‌డ తాజా నినాదం. కానీ, సామాజిక వ‌ర్గాల పరంగా బీసీలు ప్ర‌త్యేకించి యాద‌వులు ఎక్కువ‌గా కాపు సామాజిక వ‌ర్గానికి వ్య‌తిరేకంగా రాజ‌కీయాన్ని న‌డుపుతుంటారు. వాళ్ల మ‌ధ్య రాజ‌కీయ రైవాల‌టీ న‌డుస్తోంది. కాపుల్లోనూ మున్నూరు, తూర్పు కాపుల మ‌ధ్య వ్య‌త్యాసం ఉంది. బ‌లిజ‌, శెట్టి బ‌ల‌జ‌ల న‌డుమ గోదావ‌రి జిల్లాల్లో గ్రూపు విభేదాలు ఉంటాయ‌ని సామాజిక విశ్లేష‌కుల‌ అభిప్రాయం. ఇక మాల‌, మాదిగ సామాజిక వ‌ర్గాలు ఒకే వేదిక‌పైకి వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ. పైగా వ‌ర్గీక‌ర‌ణ అంశం ఇప్పుడు చివ‌రి ద‌శ‌కు చేరుకున్న క్ర‌మంలో ఆ రెండు సామాజిక‌వ‌ర్గాలు చేయి క‌లిపే ప్ర‌స‌క్తే ఉండ‌దు. ఇలా…ఏపీలోని సామాజిక ఈక్వేష‌న్లు ఉండ‌గా, ముద్ర‌గ‌డ ఇచ్చిన కాపు, బీసీ, ద‌ళిత స‌మీక‌ర‌ణ సాధ్యం కావ‌డం చాలా క‌ష్టం.ఇటీవ‌ల హైద్రాబాద్ కేంద్రంగా కాపు నేత‌లు ముద్ర‌గ‌డ‌, గంటా శ్రీనివాస‌రావు, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ, మంత్రి బొత్సా త‌దిత‌రులు స‌మావేశం అయ్యారు. ప్ర‌జారాజ్యం విలీనం ప్ర‌భావం జ‌న‌సేన మీద బాగా ఉందని భావించార‌ట‌. పైగా కాపు సామాజిక వ‌ర్గం ముద్ర జ‌న‌సేన‌కు 2019 ఎన్నిక‌ల్లో 6శాతానికి లోపుగానే ఓట్లు ప‌డ్డాయ‌ని లెక్కించారు. అవి కూడా బీఎస్సీ, క‌మ్యూనిస్టులు క‌లిస్తే వ‌చ్చిన ఓట్లు. కేవ‌లం జ‌న‌సేన వాట లెక్కిస్తే మూడు నుంచి 4 శాతానికి మించి ఉండ‌వ‌ని వాళ్లు అంచ‌నా వేశార‌ట‌. ఆ క్ర‌మంలో కొత్త పార్టీ వైపు అడుగులు వేయాల‌ని ప్రాథ‌మికంగా అనుకున్నార‌ని తెలిసింది. దాని ఫ‌లిత‌మే తాజాగా ముద్ర‌గ‌డ రాసిన లేఖ అంటూ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ ప్రారంభం అయింది.