ఏపీ లిక్కర్ స్కామ్(AP Liquor Scam)లో ఎప్పటికప్పుడు కొత్త మలుపులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఈ కేసులో విచారణను కొనసాగిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ముందు వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి (Midhun Reddy) హాజరయ్యారు. న్యాయవాదులతో కలిసి సిట్ కార్యాలయానికి వచ్చిన ఆయన, విచారణలో పాల్గొన్నారు. ఇదివరకే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు. కాగా రాజ్ కసిరెడ్డికి నాలుగోసారి నోటీసులు పంపించినా, ఆయన గైర్హాజరై ఉండటంతో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది.
Untimely Rains : అకాల వర్షాలు..అన్నదాతలు ఆగమాగం
విచారణ సందర్భంగా సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అనేక కీలక ప్రశ్నలతో నిలదీశే అవకాశం ఉంది. నిన్న విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి, స్కాంలోని ప్రధాన మాస్టర్ మైండ్‌గా రాజ్ కసిరెడ్డినే అభివర్ణిస్తూ పలు పేర్లను బయటపెట్టారు. దీంతో ఈ రోజు మిథున్ రెడ్డికి సిట్ అధికారులు వందల సంఖ్యలో ప్రశ్నలు సంధించవచ్చని తెలుస్తోంది. అయితే కోర్టు ఆదేశాల మేరకు విచారణ వీడియో లేదా ఆడియోగా రికార్డ్ చేయనివ్వకపోయినా, న్యాయవాది సమక్షంలో దర్యాప్తు కొనసాగుతోంది.
ఇక ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి ప్రస్తుతం అందుబాటులో లేరు. ఇప్పటికే ఆయన తండ్రిని రెండు రోజుల పాటు విచారించిన సిట్, ఆయన గురించి సమాచారం లేకపోవటంతో మరింత నిశితంగా దర్యాప్తు చేపట్టింది. కేసులో కీలక మలుపులు తలెత్తుతున్న వేళ, మిథున్ రెడ్డి ఇచ్చే సమాధానాలు, దర్యాప్తులో కొత్త దిశను సూచించే అవకాశం ఉండడంతో రాజకీయ వర్గాల్లో ఈ విచారణపై ఉత్కంఠ నెలకొంది.