Site icon HashtagU Telugu

Hinduja Group: ఫలిస్తున్న సీఎం చంద్రబాబు ప్రయత్నాలు.. రాష్ట్రానికి మ‌రో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు!

Hinduja Group

Hinduja Group

Hinduja Group: లండన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి పెట్టుబడులను స్వాగతించేందుకు వరుసగా పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశం అవుతున్నారు. సోమవారం లండన్‌లోని ది లాంగ్లీ, బకింగ్‌హామ్‌షైర్‌లో హిందుజా (Hinduja Group) గ్రూప్ చైర్మన్ అశోక్ హిందుజా, ఆ సంస్థ యూరప్ చైర్మన్ ప్రకాశ్ హిందుజాతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను ముఖ్యమంత్రి ముందుగా వారికి వివరించారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హిందూజా గ్రూప్‌తో కీలక ఒప్పందం కుదిరింది. దశలవారీగా ఏపీలో రూ.20 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని హిందూజా గ్రూప్ నిర్ణయించుకుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందంపైనా సంతకాలు చేసింది.

ప్రధాన ప్రాజెక్టులు

విశాఖలోని హిందూజా సంస్థకు ప్రస్తుతమున్న 1,050 మెగావాట్ల థర్మల్ ప్లాంట్‌కు అదనంగా మరో 1,600 మెగావాట్ల వరకు సామర్ధ్యాన్ని విస్తరించనుంది. ఒకొక్కటి 800 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన రెండు కొత్త యూనిట్లను స్థాపిస్తుంది. అలాగే రాయలసీమలో భారీ సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తుంది. మరోవైపు ఆధునిక ఎలక్ట్రిక్ బస్సులు, లైట్ కమర్షియల్ వాహనాల తయారీ లక్ష్యంగా కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ నెలకొల్పనుంది. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా EV ఛార్జింగ్ నెట్‌వర్క్ తీసుకురానుంది.

Also Read: 20 Lakh Jobs : రాష్ట్రంలో నిరుద్యోగులకు ’20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం’ – మంత్రి నారా లోకేష్

ఇది రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు దోహదపడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్ స్థాపనకు అనంతపురం, కర్నూలు, అమరావతిని హిందుజా పరిశీలించనుంది. ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్‌గా తీర్చిదిద్దడంలో హిందుజా గ్రూప్ పెట్టుబడులు కీలకం అవుతాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో పారిశ్రామిక ప్రగతి కోసం అత్యుత్తమ వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ ఒప్పందంతో రాష్ట్రంలో యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. హిందుజా గ్రూప్ ప్రతిపాదనలు త్వరితగతిన కార్యరూపం దాల్చేలా ప్రత్యేకంగా ఫాస్ట్-ట్రాక్ విండో ఏర్పాటు ద్వారా ట్రాక్ చేస్తామని హిందుజా ప్రతినిధులకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

Exit mobile version