ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ఢీకొన్న మొంథా తుఫాను బీభత్సం సృష్టించింది. ఆదివారం అర్థరాత్రి మొదలుకొని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, బలమైన గాలులతో రాష్ట్రంలోని కోస్తా జిల్లాలు వణికిపోయాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు విస్తృతంగా చెట్లు విరిగి రహదారులపై అడ్డంగా పడిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ స్థంబాలు నేలకొరిగి, వాటి ప్రభావంతో ముందుగానే అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేయాల్సి వచ్చింది. తీర ప్రాంతాల్లో 90 నుండి 100 కిలోమీటర్లు వేగంతో వీచిన గాలులు రాకాసి అలలను ఉప్పొంగించాయి. ఏడు జిల్లాల్లో పెనుగాలులు భారీ నష్టానికి కారణమయ్యాయి.
Diabetes Winter Care: షుగర్ సమస్య ఉన్నవారు చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీకు తెలుసా?
మొంథా తుఫాను కారణంగా బంగాళాఖాతంలో అలలు ఉధృతంగా ఎగిసి పడుతుండటంతో కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలిచ్చింది. మహేంద్రతనయ, వంశధార, నాగావళి వంటి నదులు ఒడిషా నుండి వస్తున్న వరదల ప్రభావంతో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. విశాఖ–పాడేరు మార్గంలో వరద నీరు రోడ్లపై ప్రవహిస్తుండగా, అరకు–విశాఖ రైలుమార్గంలో కొండచరియలు జారిపడటంతో రైల్వే ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది. అధికారులు పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు.
వ్యవసాయ రంగం కూడా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా వరి, ఉద్యాన పంటలు వరద నీటితో మునిగిపోయి రైతులు ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వ సహాయం వెంటనే అందించాలని వారు కోరుతున్నారు. మత్స్యకార గ్రామాల్లో పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంది. కాకినాడ సమీపంలో ఓ మత్స్యకారుడు అలలలో కొట్టుకుపోయిన ఘటన స్థానికులను కలవరపరుస్తోంది. ఒంగోలు పట్టణంలో ప్రధాన రహదారులు వరద నీటితో మునిగిపోవడంతో పౌరులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం మీద 3,000 మందికి పైగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించగా, 60 కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రమాదాన్ని ఎదుర్కొనే ఏర్పాట్లు ప్రభుత్వం కొనసాగిస్తోంది. మొంథా తుఫాను ప్రభావం ఇంకా కొనసాగుతుండటంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
