Mobile Ration Vans: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్ రేషన్ పంపిణీ వ్యవస్థలో సంస్కరణల్లో భాగంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1, 2025 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ రేషన్ వ్యాన్ల (Mobile Ration Vans)ను రద్దు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇకపై రేషన్ కార్డుదారులు తమ బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను స్థానిక రేషన్ దుకాణాలకు వెళ్లి తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ నిర్ణయం రేషన్ పంపిణీలో పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచడం.. అలాగే అవినీతి, అక్రమ రవాణాను అరికట్టడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
మొబైల్ రేషన్ వ్యాన్లు 2021లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో “డోర్ డెలివరీ” పథకంలో భాగంగా ప్రవేశపెట్టారు. దీని ద్వారా రేషన్ సరుకులను నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకు చేర్చాలని లక్ష్యంగా గత ప్రభుత్వం ఈ వ్యాన్లను ప్రవేశపెట్టింది. ఈ వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఈ వ్యాన్లు “డోర్ డెలివరీ” కంటే “స్ట్రీట్ రేషన్ వ్యాన్లు”గా మారాయని, లబ్ధిదారులకు గణనీయమైన ప్రయోజనం చేకూర్చలేదని ఆయన పేర్కొన్నారు.
మంత్రి మాట్లాడుతూ.. వ్యాన్ల షెడ్యూల్ గురించి ముందస్తు సమాచారం లేకపోవడం వల్ల లబ్ధిదారులు, ముఖ్యంగా రోజువారీ కూలీలు ఇంట్లో ఉండి రేషన్ తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారని తెలిపారు. తెనాలిలో ఒక మహిళ తన రేషన్ సరుకులను తీసుకోలేకపోయిన సమస్యను లేవనెత్తగా మంత్రి ఈ విషయంపై స్పందిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అదనంగా ఈ వ్యాన్ల ద్వారా రేషన్ బియ్యం అక్రమ రవాణా, స్మగ్లింగ్ జరుగుతోందని, ఇది ప్రభుత్వానికి ఆర్థిక భారాన్ని కలిగించిందని ఆయన ఆరోపించారు.
రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ
జూన్ 1, 2025 నుంచి రేషన్ సరుకులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫెయిర్ ప్రైస్ షాపుల ద్వారా మాత్రమే పంపిణీ చేయబడతాయి. ఈ నిర్ణయం రేషన్ పంపిణీ వ్యవస్థను సమర్థవంతంగా చేయడంతో పాటు, గతంలో ఎదురైన సమస్యలను పరిష్కరించడానికి ఛాన్స్ ఉంటుందని కూటమి సర్కార్ భావన. రేషన్ దుకాణాల ద్వారా సరుకులు తీసుకోవడం వల్ల లబ్ధిదారులు నిర్ణీత సమయాల్లో సౌకర్యవంతంగా రేషన్ సేకరించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read: Coca-Cola India : ‘మైదాన్ సాఫ్’ ప్రచారంపై డాక్యుమెంటరీని ప్రసారం చేయనున్న డిస్కవరీ ఛానల్
రేషన్ వ్యవస్థలో సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేయనుంది. ఈ కార్డులు క్యూఆర్ కోడ్‌తో ఉంటాయి. ఏటీఎం కార్డుల రూపంలో ఉంటాయి. ఇవి భద్రతా ఫీచర్లతో సహా కుటుంబ సభ్యుల వివరాలను కలిగి ఉంటాయి. మే 2025 నుంచి ఈ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ-కేవైసీ ప్రక్రియ ఏప్రిల్ 30, 2025 నాటికి పూర్తయింది. ఈ కార్డుల ద్వారా దేశవ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ సరుకులను తీసుకునే సౌలభ్యం ఉంటుంది.