Marri Rajasekhar : గుంటూరు: వైసీపీకీ మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపించారు. ఇప్పటికే వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు పోతుల సురేష్, కళ్యాణ చక్రవర్తి, కర్తి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా మర్రి రాజశేఖర్ రాజీనామాతో వైసీపీ అసంతృప్త ఎమ్మెల్సీల సంఖ్య 5కు పెరిగింది. మర్రి రాజశేఖర్ 2004లో చిలకలూరిపేటలో స్వతంత్య్ర ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని స్థాపించడంతో ఆ పార్టీలో చేరారు.
Read Also: Gold Price Today : ఇక సామాన్య ప్రజలు పసిడి కొనలేరు !
గత కొంతకాలంగా రాజశేఖర్ పార్టీని వీడి వెళతారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల కిందట ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ నేతలతో జగన్ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి మర్రి రాజశేఖర్ రాలేదు. దీంతో ఆయన రాజీనామా చేస్తారని వార్తలకు బలం చేకూరింది. వైసీపీ ఆవిర్భావం నుంచి రాజశేఖర్ ఆ పార్టీలో ఉన్నారు. 2014లో రాజశేఖర్ కు చిలకలూరిపేట టికెట్ ఇవ్వగా పత్తిపాటి పుల్లారావు పై ఓటమిపాలయ్యారు. ఇక, రాజశేఖర్ టీడీపీలో చేరతారని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. టీడీపీ నేతలతో కొంతకాలంగా ఆయన టచ్ లో ఉన్నట్లు సమాచారం.
కాగా, 2019 ఎన్నికల్లో రాజశేఖర్‌కు సీటు ఇవ్వకుండా.. చిలకలూరిపేట టికెట్ ను విడుదల రజని కి కేటాయించారు. దీంతో అసంతృప్తిగా ఉన్న ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే సమయం వచ్చినప్పుడు ఆ పదవిని కట్టబెట్టారు. విడుదల రజినికి ఈ మధ్యకాలంలో చిలకలూరిపేట వైసీపీ ఇన్చార్జి బాధ్యతలు అప్పచెప్పారు. తన సొంత నియోజకవర్గంలో మళ్లీ రజిని తీసుకురావడంపై రాజశేఖర్ తీవ్ర అసంతృప్తి చెందినట్లు సమాచారం. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు.