ఏపీ (AP )లో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో భారీ విజయం సాధించింది కూటమి సర్కార్. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం సర్వ నాశనమైందని, రాష్ట్ర ప్రజలు బ్రతుకుదెరువు కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని..చదువుకున్న యువత..కూలీలుగా మారాల్సి వచ్చిందని , క్రైమ్ విపరీతంగా పెరిగిందని..కబ్జాలు , భూ దందాలు ఇలా అనేక అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయని చెప్పి అనేక విషయాలు కూటమి నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లి మార్పు రావాలని, ఇవన్నీ అంతమవ్వాలంటే అధికారంలోకి కూటమి సర్కార్ రావాలని పిలుపునిచ్చారు.
ప్రజలు సైతం కూటమి సర్కార్ పై ఎంతో నమ్మకంతో భారీ విజయం అందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయం అందించి అధికారం కట్టపెట్టారు. సీఎం గా బాధ్యత చేపట్టిన చంద్రబాబు సైతం ప్రజలకు మంచి చేయాలనీ , ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు తమ ప్రభుత్వం లో జరగకూడదని జాగ్రత్తపడుతూ ముందుకు వెళ్తున్నారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం చంద్రబాబు కు చెడ్డ పేరును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అధికారం చేపట్టి ఎన్నో నెలలు కాకముందే తమలోని వక్రబుద్ధిని బయటకు చూపిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఎలాగైతే కమిషన్ లకు పాల్పడ్డారో..అదే మాదిరి కూటమి లోని పలువురు ఎమ్మెల్యేలు కమిషన్ లు అడుగుతున్నారట.
తాజాగా రాష్ట్ర సర్కార్ రాష్ట్రంలో లిక్కర్ పాలసీ ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్రక్రియలో ఎమ్మెల్యేలు దందాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. దరఖాస్తులు వేయొద్దని, తమకు వాటాలు ఇవ్వాలని వ్యాపారులను డిమాండ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై దరకాస్తు దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,396 మద్యం దుకాణాలు, 12 స్మార్ట్ స్టోర్స్లకు లైసెన్సుల జారీకి ఎక్సైజ్ శాఖ సోమవారం అర్ధరాత్రి తర్వాత నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు చేయడానికి ఈ నెల తొమ్మిది వరకు గడువు ఇచ్చింది. ఇంకా గడువు ఉన్న తరుణంలో మొత్తంగా లక్షకుపైగా దరఖాస్తులు రావొచ్చని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు.
నాన్ రిఫండబుల్ దరఖాస్తు రుసుముల రూపంలోనే సుమారు రూ.2 వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుందని భావిస్తున్నారు. గతంలో 2017లో 4,380 మద్యం దుకాణాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా, ఒక్కో దానికి సగటున 18 చొప్పున మొత్తంగా 78 వేల దరఖాస్తులు వచ్చాయి. ఈసారి 3,396 దుకాణాలకుగానూ ఒక్కో దానికి సగటున 30 వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా గుంటూరు, మంగళగిరి-తాడేపల్లి, పొన్నూరు తదితర నగరాల్లో సగటున ఒక్కో షాపునకు 10కి పైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. గతంలో ఎవరైతే మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు నడిపారో వారే దరఖాస్తులు చేసుకుంటారని ఎక్సైజ్ అధికారులు భావించారు. కానీ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, డాక్టర్స్ , ఆడిటర్లు, కాంట్రాక్టర్లు ఇలా అనేక రంగాల వారు స్వయంగా కార్యాలయాలకు వచ్చి దరఖాస్తు చేసే విషయమై సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారని అధికారులు వెల్లడించారు.
Read Also : Chennai Airshow: చెన్నై మెరీనా బీచ్ ఎయిర్‌షోలో ముగ్గురి మృతి.. తొక్కిసలాట కారణమా..?