TDP ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వీరంగం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరున్న దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఏలూరులో రాత్రి 11 గంటల తర్వాత నడిరోడ్డుపై హంగామా చేశారు. చింతమనేని జేసీబీలను వెంటబెట్టుకుని టీడీపీ సీనియర్ నేత, న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబు ఇంటిపైకి వెళ్లారు. చింతమనేని వందలాది మంది అనుచరులతో లాయర్ ఇంటికి వెళ్లారు.. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. నడిరోడ్డుపై నిలబడి ఊగుతూ, బూతులు తిడుతూ, అరుస్తూ.. ‘వాడో నేనో తేలిపోవాలి.. చంపేస్తా’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. […]

Published By: HashtagU Telugu Desk
MLA Chintamaneni Prabhakar goes on a rampage.

MLA Chintamaneni Prabhakar goes on a rampage.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరున్న దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఏలూరులో రాత్రి 11 గంటల తర్వాత నడిరోడ్డుపై హంగామా చేశారు. చింతమనేని జేసీబీలను వెంటబెట్టుకుని టీడీపీ సీనియర్ నేత, న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబు ఇంటిపైకి వెళ్లారు. చింతమనేని వందలాది మంది అనుచరులతో లాయర్ ఇంటికి వెళ్లారు.. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. నడిరోడ్డుపై నిలబడి ఊగుతూ, బూతులు తిడుతూ, అరుస్తూ.. ‘వాడో నేనో తేలిపోవాలి.. చంపేస్తా’ అంటూ వార్నింగ్ ఇచ్చారు.

చింతమనేనికి సర్థిచెప్పేందుకు ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నించినా వెనక్కు తగ్గలేదు. ప్రభాకర్‌ను ఆయన కుమార్తె వద్దని వారించినా సరే ఆగలేదు. ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.. అయినా సరే చింతమనేని వారి ముందే రెచ్చిపోయారు. తనను ఆపొద్దంటూ డీఎస్పీతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉన్న చింతమనేని ఇలా చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభాకర్ మద్యం మత్తులో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. పోలీసులు వారించినా సరే వెనక్కు తగ్గకుండా.. వారి సమక్షంలోనే శ్రీనివాస్‌కు చింతమనేని వార్నింగ్ ఇచ్చారు. అర్ధరాత్రి ఒంటిగంట వరకు హైడ్రామా కొనసాగింది.

ఇటీవల ఈడ్పుగంటి శ్రీనివాసబాబు ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌‌పై ఆరోపణలు చేశారు. దెందులూరు నియోజకవర్గంలో శాండ్, ల్యాండ్, మైన్, వైన్ మాఫియాలు నడుస్తున్నాయంటూ ఘాటుగా విమర్శలు చేశారు. దెందులూరు నియోజకవర్గంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడిపిస్తున్నారని.. దెందులూరులో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందంటూ చింతమనేనిపై మండిపడ్డారు. శ్రీనివాసబాబు టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. సొంత పార్టీ నేత నుంచి చింతమనేనిపై విమర్శలు రావడం హాట్‌‌టాపిక్ అయ్యింది. ఇప్పుడు ఈడ్పుగంటి శ్రీనివాసబాబు ఇంటిపై చింతమనేని దాడికి ప్రయత్నించడం చర్చనీయాంశమైంది.

చింతమనేని గతంలోనూ వివాదాల్లో చిక్కుకున్నారు. గతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో మహిళా తహసీల్దార్ వనజాక్షిపై ప్రభాకర్ దాడి చేశారనే ఆరోపణలు వచ్చాయి. చింతమనేనిపై కేసు కూడా నమోదైంది. ఈ వివాదం తర్వాత చంద్రబాబు పిలిచి చింతమనేనిని మందలించారు. ఆ తర్వాత కూడా మరికొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. 2024 ఎన్నికల తర్వాత చింతమనేని నియోజకవర్గానికి పరిమితమయ్యారు.. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లలేదు. ఇప్పుడు సొంత పార్టీ నేతతో వివాదంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు.

 

  Last Updated: 15 Jun 2026, 11:46 AM IST