Site icon HashtagU Telugu

Tirumala: తిరుమ‌ల గోశాల‌లో గోవులు మ‌ర‌ణించాయా..? వైసీపీ ఆరోప‌ణ‌లకు స్ట్రాంగ్ రియాక్ష‌న్

Goshala

Goshala

Tirumala: తిరుమ‌ల తిరుప‌తి అంటే హిందువుల‌కు ఎంతో ప‌విత్ర‌మైన స్థ‌లం. తిరుమ‌ల కొండ‌పై శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామివారిని ద‌ర్శించుకునేందుకు రోజుకు వేలాది మంది భ‌క్తులు వెళ్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచేకాక దేశ, విదేశాల నుంచి భ‌క్తులు తిరుమ‌ల కొండ‌కు వ‌చ్చి స్వామివారిని ద‌ర్శించుకుంటారు. అలాంటి ప‌విత్ర‌మైన పుణ్య‌క్షేత్రంలో ఇటీవ‌ల ప‌లు విషాద ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో తిరుమ‌ల‌ ల‌డ్డూ త‌యారీలో క‌ల్తీనెయ్యి వాడారంటూ కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వెలుగులోకి వ‌చ్చింది. ఆ అంశంపై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌జ‌రిగింది. ఆ త‌రువాత కొద్దిరోజుల‌కే తిరుమ‌ల‌లో తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో ప‌లువురు భ‌క్తులు మ‌ర‌ణించారు. అయితే, తాజాగా.. తిరుమ‌ల‌లోని గోశాల‌లో వంద గోవులు మృతిచెందాయంటూ వైసీపీ నేత‌, మాజీ టీటీడీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి ఆరోప‌ణ‌లు చేయ‌డం తీవ్ర దుమారాన్ని రేపింది.

Also Read: Vaastu Tips: ఇంటి ప్రధాన ద్వారంలో ఈ 8 తప్పులు చేయ‌కూడ‌ద‌ట‌!

టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ గోశాలలో గోవులు దారుణంగా చనిపోతున్నాయని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనది గోమాత‌ అని.. హిందూ ధర్మ పరిరక్షణ ధ్యేయం అంటున్న ఎన్డీఏ ప్రభుత్వంలో వందకు పైగా గోవులు చనిపోయాయని అన్నారు. టీటీడీ అధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ గోశాలలో గత మూడు నెలలుగా వందకుపైగా ఆవులు చనిపోతున్నా పట్టించుకోకుండా ఉన్నారని విమర్శించారు. ఎస్వీ గోశాలలో గోవులను దుస్థితి దారుణంగా ఉందంటూ భూమ‌న తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు. భూమన వ్యాఖ్య‌ల‌పై టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అపద్ధపు ఆరోపణలు చేయడం కాదని.. గోశాల పరిశీలనకు రావాలని ఛాలెంజ్ విసిరారు. ఆయన వస్తే అన్ని రికార్డులను చూపిస్తామన్నారు.

Also Read: Fact Check : ‘‘రూ. 21వేలతో 31 రోజుల్లో రూ.31 లక్షలు’’.. ఇవి సుధామూర్తి వ్యాఖ్యలేనా ?

టీటీడీ గోశాలలో ఆవులు మ‌ర‌ణించాయంటూ వైసీపీ ఆరోప‌ణ‌లను మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ఈ మేర‌కు ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. అవులు మ‌ర‌ణంపై సోషల్ మీడియాలో జరుగుతున్న నిరాధారమైన, దురుద్దేశపూరిత ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని పేర్కొన్నారు. ఈ వాదనలలో ఎటువంటి నిజం లేదు. వైఎస్‌ఆర్‌సీపీ ప్ర‌జ‌ల‌ను తప్పుదారి పట్టించడానికి, రెచ్చగొట్టడానికి ముందుకు తెచ్చిన ఈ తప్పుడు కథనాన్ని భక్తులు నమ్మవద్దని లోకేశ్‌ కోరారు. రాజకీయ లాభం కోసం పవిత్ర సంస్థల గురించి అబద్ధాలను వ్యాప్తి చేయడం ఆమోదయోగ్యం కాదంటూ వైసీపీ నేత‌ల‌పై లోకేశ్‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మ‌రోవైపు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయ‌ణ రెడ్డి, టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, పాల‌క‌మండ‌లి స‌భ్యులు మీడియా స‌మావేశంలో మాట్లాడారు. మంత్రి ఆనం మాట్లాడుతూ భూమ‌న క‌రుణారెడ్డి వ్యాఖ్య‌ల ప‌ట్ల తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తిరుమ‌ల గోశాల‌లో గోవులు మృతి చెంద‌డం అస‌త్యం అన్నారు. ప్ర‌జ‌లు చిత్తుగా ఓడించినా భూమ‌న‌కు బుద్ది రాలేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.