Site icon HashtagU Telugu

Lokesh : బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ..నైపుణ్యాభివృద్ధిపై కీలక చర్చలు

Minister Lokesh meets former British Prime Minister Tony Blair.. holds key discussions on skill development

Minister Lokesh meets former British Prime Minister Tony Blair.. holds key discussions on skill development

Lokesh : బ్రిటన్ మాజీ ప్రధాని, టోనీ బ్లెయిర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్(టీబీఐ) వ్యవస్థాపకుడు టోనీ బ్లెయిర్‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సభ్యుడు నారా లోకేశ్ ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ పరిపాలన, విద్య, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. విద్యా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ వినియోగాన్ని పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై లోకేశ్ వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో టీబీఐ సంస్థ విద్యా రంగానికి సాంకేతిక మద్దతు ఇవ్వడానికి ఆసక్తి చూపింది. నైపుణ్య శిక్షణ కార్యక్రమాల్లో సాంకేతిక సహకారం, వినూత్న శిక్షణా విధానాలపై కూడా చర్చలు జరిగాయి.

Read Also: Mohammed Siraj : కొత్త బిజినెస్‌లొకి మహ్మద్ సిరాజ్

ఈ భేటీలో గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు సంబంధించి రెండు పక్షాలు పరస్పర సహకార ఒప్పందానికి కూడా చేరుకున్నాయి. ఈ సంస్థ ద్వారా పరిపాలనా విధానాల్లో పారదర్శకత, సమర్థత పెరిగేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ ఇనిస్టిట్యూట్ సలహా బోర్డులో టోనీ బ్లెయిర్‌ను చేర్చాలని లోకేశ్ ఆయనను స్వయంగా ఆహ్వానించారు. అంతేగాక, రాష్ట్రంలో అమలవుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, స్కిల్ సెన్సస్ మొదలైన కార్యక్రమాల్లో టీబీఐ నుంచి సాంకేతిక మార్గదర్శకత్వం లభించాలని మంత్రి అభిప్రాయపడ్డారు. విదేశాల్లో ఉపాధి అవకాశాలు పెంచేలా ఆంధ్రప్రదేశ్ యువతను సిద్ధం చేయడం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ ఇవ్వడం పైనూ చర్చలు జరిగాయి.

ఈ సందర్భంగా టోనీ బ్లెయిర్ మాట్లాడుతూ.. ఈ ఆగస్టులో విశాఖపట్నంలో జరగబోయే రాష్ట్రాల విద్యామంత్రుల కాంక్లేవ్‌లో టీబీఐ భాగస్వామిగా పాల్గొంటుందని హామీ ఇచ్చారు. విద్యా విధానాల మార్పు, కొత్త సాంకేతికతల వినియోగం వంటి అంశాలపై తమ సంస్థ నుంచి విశేషమైన సహకారం అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, టోనీ బ్లెయిర్ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధులు పాల్గొన్నారు. భవిష్యత్ లో విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిపాలన వ్యవస్థల్లో సమగ్ర అభివృద్ధికి ఈ సమావేశం మైలురాయిగా నిలవనుంది.

Read Also: Auto Tips : పెట్రోల్-డీజిల్ కారును ఎలక్ట్రిక్ కారుగా ఎలా మార్చాలో తెలుసా..?