Whatsapp Governance : దేశంలో తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ ను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు మన మిత్ర పేరుతో ఈ సేవలను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. వాట్సాప్ నెంబరు 95523 00009 కు మెసేజ్ చేస్తే సేవలను పొందవచ్చన్నారు. ఇక నుంచి ప్రభుత్వ ధృవపత్రాలన్నీ వాట్సప్ ద్వారానే ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తొలి విడతగా 161సేవలను అందించనున్నారు. పౌరులకు అవసరమైన అన్ని సేవలను వాట్సప్ ద్వారా సేవలను పొందవచ్చు. ఈ తొలి విడతలో దేవాదాయ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖలలోని సేవలు అందిస్తారు.
కేవలం పౌరసేవలతో పాటు అవసరమైన సమాచారాన్ని కూడా ఈ సేవలను పొందే అవకాశముంటుంది. రెండో దశలో 300కు పైగా సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని లోకేశ్ వివరించారు. రెండో విడతలో వాట్సప్ గవర్నెన్స్ కు ఏఐని కూడా జోడిస్తామన్నారు. నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసే అవకాశమే లేకుండా వాట్సప్ గవర్నెన్స్ ఉండబోతోందని అన్నారు. భవిష్యత్ లో ఈ సేవలను ఐదు వందల వరకూ విస్తరిస్తామని మత్రి లోకేశ్ తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం మరింత చేరువగా తీసుకు వచ్చే విధంగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు.
సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలికి వాట్సప్ సేవలతో అందించనున్నామని తెలిపారు. ప్రజల వినతులు, ఫిర్యాదులు ఇవ్వాలనుకుంటే వాట్సప్ నంబర్‌కు సమాచారం అందిస్తే వెంటనే ఒక లింక్ వస్తుందని, అందులో పేరు, ఫోన్ నంబర్, చిరునామా తదితరాలు నమోదు చేసి సమస్యను టైప్ చేయాలని సూచించారు. వెంటనే వారికి ఒక రిఫరెన్స్ నంబరు వస్తుందని, దాని ఆధారంగా తమ వినతి పరిష్కారం ఎంత వరకూ వచ్చింది? ఎవరి వద్ద ఉంద అనేది పౌరులు తెలుసుకోవచ్చని మంత్రి లోకేశ్ అన్నారు.
ఏపీఎస్‌ఆర్టీసీ టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, విద్యుత్ బిల్లులు, ఆస్తి పన్నులు, ట్రేడ్ లైసెన్స్‌లు, రెవెన్యూ శాఖకు సంబంధించి ల్యాండ్ రికార్డులు వంటివి ఈ సేవలో అందిస్తామని పేర్కొన్నారు. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఆదాయం, నో ఎర్నింగ్‌తో పాటు వివిధ శాఖలకు సంబంధించిన అనేక సర్టిఫికెట్లు వాట్సప్ ద్వారా పొందవచ్చని పేర్కొన్నారు. ఇక, వాట్సప్ ద్వారా పౌరసేవలు అందించేందుకు 2024 అక్టోబరు 22న మెటా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు ఇప్పుడు వాట్సప్ గవర్నెన్స్ తీసుకువస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. వేగంగా పౌరసేవలు అందించటం, పారదర్శకత, జవాబుదారీతనంలో భాగంగా వాట్సప్ గవర్నెన్స్ అందుబాటులోకి తీసుకువచ్చారు. సమాచార గోప్యత, వేగంగా సేవలందించేందుకు జనరేటివ్ ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాట్సప్ గవర్నెన్స్ పని చేస్తుంది.